మావోయిస్టుల పలాయనం

20 Sep, 2020 07:25 IST|Sakshi
వేర్వేరు శిబిరాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టు సామగ్రి

శిబిరాలు ధ్వంసం చేసిన పోలీసులు

భారీగా సామగ్రి స్వాధీనం 

బరంపురం: కొందమాల్‌ జిల్లాలో రెండు రోజులుగా మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ జవాన్‌ల మధ్య రెండు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలలో రెండు మావోయిస్టుల శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసి భారీగా సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కొందమాల్‌ ఎస్‌పీ వినీత్‌ అగర్‌వాల్‌ తెలియజేశారు. శనివారం సాయంత్రం జిల్లా  హెడ్‌క్వార్టర్‌ పుల్బణిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వినీత్‌ అగర్‌వాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని బల్లిగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధి కలహండి జిల్లా సరిహద్దు పంగిబాజు అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు, ఎస్‌ఓజీ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరగడంతో తాళలేక మావోయిస్టులు తప్పించుకున్నారు.

పంగిబాజు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విడిచి వెళ్లిన శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేసి భారీగా మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే శుక్రవారం  తుమ్ముడిబొంద పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల బురానహి దక్షిణ రిజర్వ్‌  అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులతో తట్టుకోలేక మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పారు. బురానహి దక్షిణ రిజర్వ్‌ శిబిరాన్ని వీడి మావోయిస్టులు పారిపోవడంతో పోలీసులు శిబిరాన్ని ధ్వంసం చేశారు. అయితే వేర్వేరు కాల్పుల సంఘటనలలో  మావోయిస్టులు ఎవరూ మృతి చెందలేదని తెలియజేశారు. తప్పించుకున్న మావోయిస్టుల శిబిరంలో సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు మురళి ఉన్నట్లు ఎస్‌పీ  తెలియజేశారు. మావోయిస్టులు వీడి పారిపోయిన శిబిరాల్లో భారీ విస్ఫోటక సామగ్రితో పాటు మూడు విదేశీ తుపాకులు, రెండు ప్లాస్టిక్‌ పెట్టెలు, ఔషధాలు, ప్లాస్టిక్‌ కవర్లు, విప్లవ సాహిత్యం, మావోయిస్టు దుస్తులు, వాటర్‌ బాటిల్స్, విద్యుత్‌ తీగలు, సిరంజిలు, నిత్యావసర సామగ్రి ఉన్నట్లు ఎస్‌పీ వివరించారు. 

కొనసాగుతున్న కూంబింగ్‌  
కొందమాల్‌–కలహండి జిల్లాల సరిహద్దులకు మోహరించిన అదనపు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. స్థాని క పోలీసుల సహకారంతో మావోయిస్టుల అచూకీ కోసం దట్టమైన అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు