బంపర్‌ ఆఫర్‌.. తుపాకీ వాడకంపై పోలీసులే శిక్షణ ఇస్తారంటా.. ఎక్కడో తెలుసా.?

7 Jun, 2022 16:45 IST|Sakshi

మీకు తుపాకీ వాడటం ఇష్టమా.. కానీ, అది ఎలా వాడాలో తెలియదా..?. మీ సేఫ్టీ కోసం తుపాకీ వాడాలనుకుంటున్నారా.? అయితే, తుపాకీని ఎలా ఉపయోగించాలో సామాన్య పౌరులకు పోలీసులు శిక్షణ ఇవ్వబోతున్నారు. అదేంటి పోలీసులు శిక్షణ ఇవ్వడమేంటీ అనుకుంటాన్నారా.. మీరు విన్నది నిజమే. కేరళ పోలీసులు.. పౌరులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేరళ డీజీపీ కీలక వ్యాఖ‍్యలు చేశారు. 

వివరాల ప్రకారం.. తుపాకీ వినియోగంపై పౌరులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కేరళ డీజీపీ అనిల్​కాంత్ చెప్పారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. అయితే, ఇప్పటికే తుపాకీ వినియోగించడానికి లైసెన్స్ ఉన్నవారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. తుపాకీని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా అనుభవం లేనివారికి రూ.5,000.. అలా కాకుండా కాస్త అవగాహన ఉన్నవారు, ఫైన్-ట్యూనింగ్ అవసరం ఉన్నవారు రూ.1000కే శిక్షణ పొందవచ్చు. 

ఇదిలా ఉండగా.. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎంపిక కారని డీజీపీ స్పష్టం చేశారు. వారి ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుందని.. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంపిక జరుగుతుందని అన్నారు. ఈ సెలక్షన్ ట్రయల్‌లో ఉత్తీర్ణులైన వారికే శిక్షణ ఉంటుందన్నారు. కాగా, ఇటీవల ఓ వ్యక్తి తుపాకీ వినియోగంపై కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందులో భాగంగా న్యాయస్థానం తుపాకీ లైసెన్స్​ ఉన్న వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో డీజీపీ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిం‍ది. 

ఇది కూడా చదవండి: వాడో బచ్చా సీఐ, మూడో కన్ను తెరుస్తా.. మండిపడ్డ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు