ముఖ్యమంత్రి, డీజీపీ, కలెక్టర్‌కు ఫిర్యాదు

29 May, 2021 14:28 IST|Sakshi

లక్నో: ఆక్సిజన్‌ అందక తన కుమారుడు మృతి చెందాడని.. దానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులైనా చర్యలు తీసుకోలేరా అని అధికార పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కనీసం పోలీసులు ఆస్పత్రిపై కేసు కూడా నమోదు చేయడం లేదని ఎమ్మెల్యే వాపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని హర్దియో జిల్లాలోని శాండిల్య నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ అగర్వాల్‌ కుమారుడు అశిశ్‌ (35) ఏప్రిల్‌ 26వ తేదీన మృతి చెందారు. కకోరిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆశిశ్‌ను చేర్చగా ఉదయం ఆక్సిజన్‌ 94 ఉండగా సాయంత్రానికి ఆక్సిజన్‌ స్థాయి తగ్గిందని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బయటి నుంచి ఆక్సిజన్‌ తీసుకొచ్చి అందిస్తున్నట్లు చెప్పారని ఆ కొద్దిసేపటికి తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ వాపోయాడు. 

ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ అగర్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు ముఖ్యమంత్రి, కలెక్టర్‌, డీజీపీ, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించి తన కుమారుడి మరణానికి సంబంధించి కేసు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నా బిడ్డ మరణానికి ఆస్పత్రిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. 
 

మరిన్ని వార్తలు