అమ్మను బాధపడవద్దని చెప్పండి..

30 Sep, 2020 19:27 IST|Sakshi

సిట్‌ దర్యాప్తులో అన్ని ప్రశ్నలకు సమాధానం: యూపీ పోలీసు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రగిలిస్తోంది. 19 ఏళ్ల దళిత యువతిపై మృగాళ్లు పాశవీకంగా దాడి చేసి చావుకు కారణమయ్యారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న బిడ్డ కానరాని లోకానికి వెళ్లింది. కనీసం సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు జరపడానికి కూడా వీలు లేకుండా ప్రవర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు బాధితురాలి గురించి చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టేలా చేస్తున్నాయి.

‘యువతి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండేది. తోబుట్టువులే ఆమె స్నేహితులు. పొలం పనులు చేసేది. పాలు పితికేది. ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుకు వచ్చేది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించేది.. ఎంతో కష్టపడేది. అలాంటి అమ్మాయి ఇంత దారుణంగా మరణిస్తుంది అని కల్లో కూడా ఊహించలేదు’ అంటూ ఇరుగుపొరుగు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఎంతో ధైర్యంగా ఉందని.. తల్లిని ఓదార్చింది అంటున్నారు తోబుట్టువులు. అమ్మను బాధపడవద్దని చెప్పండి..త్వరలోనే వస్తాను అంటూ ధైర్యం చెప్పింది. చివరకు నా బిడ్డకు అంతిమ వీడ్కోలు కూడా చెప్పడానికి వీలు లేకుండా ప్రవర్తించారు పోలీసులు అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటుంటే చూసే వారు సైతం కన్నీరు కార్చారు.

ఇక పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ పోలీసు ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. దహన సంస్కారాలు  జరపడానికి ముందే మృతురాలి కుటుంబ సభ్యులు అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయంలో వస్తోన్న విమర్శలకు సిట్‌ దర్యాప్తుతో సమాధానం లభిస్తుందన్నారు. కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఈ అనుమానాలన్నింటిని సిట్‌ దర్యాప్తు క్లియర్‌ చేస్తుంది. నిజమని తేలితే చర్యలు తప్పవు. కుటుంబం, గ్రామస్తుల అనుమతితోనే దహన సంస్కారం జరిగింది. ఢిల్లీలో ఫోరెన్సిక్‌ పూర్తయ్యింది. పోలీసులు ఇందుకు సంబంధించి నలుగురు నిందితులను వివిధ చట్టాల కింద అరెస్ట్‌ చేశారు. సిట్‌ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుంది. దాచడానికి ఏం లేదు’ అని తెలిపారు. (చదవండి: యువతిపై అత్యాచారం.. నాలుక కోసి..)

కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతం, శరీరంలోని ప్రధాన భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు కన్నుమూసింది. (చదవండి: కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!)

మరిన్ని వార్తలు