యువతిని కొట్టిన పోలీస్‌, సీఎం ఆగ్రహం

29 Jul, 2020 10:29 IST|Sakshi

రాంచీ: పోలీసులు అంటే ప్రజలని రక్షించే వారు. అందుకే వారిని రక్షక భటులు అంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం కొంత మంది పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉంటారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతుంటారు. అలా రెచ్చిపోతే ఏం జరుగుతుందో జార్ఖండ్‌లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు.  నడిరోడ్డుపై ఓ యువతి చెంపను చెళ్లుమనిపించడంతో పాటు, ఆమె జుట్టు పట్టుకుని లాగిన ఓ పోలీసు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రే స్పందించి, ఆ పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటన జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

 రోడ్డుపై బందోబస్తులో ఉన్న ఓ పోలీసు, ఆ దారిలో వచ్చిన ఓ యువతిని ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు.  ఆపై చెంపమీద ఒక్కటిచ్చాడు. అంతటితో ఆగకుండా  జుట్టు పట్టుకుని మరీ లాగాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా అది సోషల్ మీడియాకు చేరడంతో వైరల్‌గా మారింది.  సదరు పోలీసు తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో కాస్త జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లగా, దాన్ని చూసిన ఆయన, రాష్ట్ర డీజీపీ ఎమ్ వీ రావుకు ట్యాగ్ చేస్తూ, వీడియోను షేర్ చేశారు. ఇటువంటి నీచమైన, అనుచిత ప్రవర్తనలను ఎంత మాత్రం భరించరాదని ట్వీట్ చేశారు. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు పోలీసును సస్పెండ్ చేస్తున్నట్టు  డీజీపీ ప్రకటించారు.  ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేశారు. 

చదవండి: 11 మంది పోలీసులకు జీవిత ఖైదు

మరిన్ని వార్తలు