ఫ్రాంక్‌ కాల్‌ చేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన 8 ఏళ్ల బాలిక

23 Jul, 2021 18:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: క్రైం షోల మీద ఉన్న ఆసక్తి కారణంగా ఓ బాలిక పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. కొంతమందిని చంపేశారని పోలీసులను సమాచారమిచ్చి వారిని ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకు అసలు నిజం తెలియడంతో షాక్‌కు గురవ్వడం అందరి వంతయ్యింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల పాప మంగళవారం తన తండ్రి ఫోన్‌ను రహస్యంగా తీసుకుంది. అనంతరం అయిదుగుర్ని హత్య చేశారని తండ్రి మొబైల్‌ నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసింది. ‘పోలీస్‌ అంకుల్‌. లేన్‌ నంబర్‌ 5లోని ప్రభుత్వ స్కూల్‌ వద్ద అయిదుగురు హత్యకు గురయ్యారు. దయచేసి తర్వగా రండి. నేను ఒంటిరిగా ఉన్నాను’ అని చెప్పింది.

దీంతో షాక్‌ అయిన పోలీసులు వెంటనే ఆ చిన్నారి చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ హత్య జరిగినట్లు ఎలాంటి ఆధారాలు పోలీసులకు కనిపించలేదు. దీంతో ఆ బాలిక ఫోన్‌ చేసిన మొబైల్‌కు తిరిగి కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. కాసేపటి తర్వాత పోలీసులు మళ్లీ ప్రయత్నించగా బాలిక తండ్రి కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. అతనొక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. జరిగిందంతా బాలిక తండ్రికి చెప్పారు. అంతా విన్న ఆ వ్యక్తి తమ కుమార్తె ఫ్రాంక్‌ కాల్‌ చేసి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. చివరికి అసలు నిజం తెలియడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అంతేగాక గతంలోనూ తన కుమార్తె ఇలా ఫ్రాంక్‌ కాల్స్ చేసిందని బాలిక తండ్రి పోలీసులకు వివరించాడు. తండ్రికి ప్రమాదం జరిగినట్లు తమ బంధువులకు ఫోన్‌ చేయగా వారు హుటాహుటిన తమ ఇంటికి వచ్చారని తెలిపాడు. మరోవైపు ఆ బాలిక టీవీలో వచ్చే క్రైమ్‌ షోలు చూస్తుందని, పోలీసులు స్పందిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు అప్పుడప్పుడు పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ 112కు ఫోన్‌ చేస్తుందని పోలీసుల విచారణలో తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలా జరుగకుండా చూడాలని బాలిక తల్లిదండ్రులను పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు