ఈ ఘటనపై అసెంబ్లీలో రచ్చ చేసిన ప్రతిపక్షాలు

9 Mar, 2021 18:05 IST|Sakshi

సచిన్‌ వాజ్‌ని శిక్షించండి: ఫడ్నవీస్‌

ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు కొనసాగతుండగానే.. సదరు వాహనం డ్రైవర్‌ మరణించాడు. ఇలా కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని దర్యాప్తును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించింది. తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ విషయంపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజ్‌ని శిక్షించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. 

ఈ క్రమంలో మంగళవారం ఫడ్నవీస్‌ అసెంబ్లీలో చనిపోయిన స్కార్పియో డ్రైవర్‌ హిరెన్‌ మన్సుఖ్‌ భార్య ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌ని చదివారు. దీనిలో సదరు డ్రైవర్‌ మరణించడానికి ముందు జరగిన సంఘటనలు వరుసగా ఉన్నాయి. అనంతరం ఫడ్నవీస్‌ "అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్ వాజ్‌ని శిక్షించాలి. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి మీరు అతనికి అవకాశం ఇస్తున్నారు. అతను (వాజ్) ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి అతడిని రక్షిస్తున్నారు. అసలు అతడిని ఎలా ఫోర్స్‌లోకి తీసుకున్నారు.. తొలుత అతడిని సస్పెండ్‌ చేయండి’’ అంటూ ఫడ్నవీస్‌ డిమాండ్‌ చేశారు. 

అంబానీ ఇంటి ముందు కలకలం రేపిన స్కార్పియో డ్రైవర్‌ హిరెన్‌ మన్సుఖ్ (45) మృతదేహాన్ని గత శుక్రవారం ముంబై సమీపంలోని ఒక కాలువ దగ్గర గుర్తించినట్లు థానే పోలీసు అధికారి తెలిపారు. గురువారం రాత్రి నుంచి అతను తప్పిపోయాడని మన్సుఖ్‌ కుటుంబం తెలిపింది. దాంతో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు బదిలీ చేశారు. చనిపోవడానికి ముందు మన్సుఖ్ తనను పోలీసు అధికారులు, జర్నలిస్టులు వేధిస్తున్నారని ఆరోపించారని ఫడ్నవీస్ తెలిపారు.

ఇక ఫడ్నవీస్‌ వ్యాఖ్యలను మహారాష్ట్ర హోంమంత్రి దేశ్‌ ముఖ్‌ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మన్సుఖ్ భార్య చేసిన ప్రకటన ఇప్పుడు మీడియాలో ప్రతిచోటా ఉంది. ప్రస్తుతం ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి  ప్రతిపక్షం దగ్గర మరిన్ని రుజువులు, ఆధారాలు ఉంటే, వారు దానిని ఏటీఎస్‌కు అందివ్వా లి. అంతేకాకా హోం మినిస్టర్‌గా నేను మీకు హామీ ఇస్తున్నాను.. ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అన్నారు అని దేశ్ ముఖ్.

చదవండి: 
అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు
అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం

మరిన్ని వార్తలు