‘నువ్వేమైనా పూజారివా?..’ షా అయోధ్య ప్రకటనపై పొలిటికల్‌ సెటైర్లు

7 Jan, 2023 12:49 IST|Sakshi

పానిపట్‌: వచ్చే ఏడాది ఆరంభం కల్లా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటనపై పొలిటికల్‌ సెటైర్లు పడుతున్నాయి. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో.. ఆలయాన్ని ఒక ప్రచార సాధనంగా వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇప్పటి నుంచే విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. ఈ క్రమంలో తాజాగా.. 

షా ప్రకటనపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ అర్హతతో అసలు ఆయన(షా) ఆ ప్రకటన చేశారని షాపై ఖర్గే మండిపడ్డారు. ‘దేవుడి మీద అందరికీ నమ్మకం ఉంటుంది. కానీ, ఇలాంటి ప్రకటనలు చేయడం దేనికి?. అదీ ఎన్నికలు జరగబోయే త్రిపురలోనే చేయాలా?.. అదీగాక 2024 మేలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి..

ఆ సమయానికే రామమందిరం పూర్తవుతుందని ఎలా ప్రకటిస్తారు. అసలు అలాంటి ప్రకటన చేయడానికి మీరెవరు?.. నువ్వేమైనా రామమందిరంలో పూజారా? లేదంటే మహంతా? అంటూ అమిత్‌ షా ప్రకటనపై ఖర్గే విసుర్లు విసిరారు. 

ఆ విషయాన్ని(రామ మందిరం పూర్తి కావడం) అర్చకులను చెప్పనివ్వండి. నువ్వు ఒక రాజకీయ నేతవి. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు. కాబట్టి.. దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణల గురించి ఆలోచించండి. అది మాత్రమే నీ పని.. అంటూ శుక్రవారం ఖర్గే భారత్‌ జోడో యాత్రలో ప్రసంగించారు. పానిపట్‌(హర్యానా)లో జరిగిన భారత్‌ జోడో యాత్ర సభలో కాంగ్రెస్‌ కీలక నేతల సమక్షంలో ఆయన ఈ విమర్శలు చేశారు. రాహుల్‌ గాంధీతో పాటు కుమారి షెల్జా, భూపిందర్‌ సింగ్‌ హూడా, కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, కిరణ్‌ చౌదరి, దిగ్విజయ్‌ సింగ్‌, డీకే శివకుమార్‌ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. గురువారం త్రిపురలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా  మాట్లాడుతూ.. జనవరి 1, 2024న రామ మందిరం పూర్తవుతుందని ప్రకటించారు. ‘‘రాహుల్‌ బాబా..’’ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేస్తూ.. అమిత్‌ షా ఈ భారీ ప్రకటన చేయడం విశేషం.

మరిన్ని వార్తలు