కర్నాటక: బీజేపీకి కొత్త టెన్షన్‌.. సీనియర్‌ నేత దారెటు?

15 Apr, 2023 15:09 IST|Sakshi

బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఏ పార్టీలోకి వెళ్తారోనన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీలకు సిట్టింగ్‌లకు, సీనియర్లకు సీటు ఇవ్వకపోవడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక, బీజేపీ పలువురు సీనియర్లకు సీటు ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలువురు కాషాయ పార్టీకి షాకిస్తూ ఇతర పార్టీల్లో చేరిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బీజేపీకి ఇచ్చిన రెండు రోజుల గడువు శనివారంతో ముగిసింది. ఈనేపథ్యంలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రంలోగా తన డెసిషన్‌ చెబుతానని తెలిపారు. కాగా, ఆయనకు టికెట్‌ ఇవ్వకపోతే.. తన అనుచరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానని షెట్టర్ బాంబ్‌ పేల్చారు.

అయితే, జగదీష్‌ షెట్టర్ కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో బలమైన నాయకుడు. ఆ ప్రాంతం బీజేపీకి కంచుకోటగా ఉంది. షెట్టర్‌ నాలుగు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. కాగా, షెట్టర్‌కు టికెట్‌ ఇవ్వకపోతే.. ఆ ప్రభావం దాదాపు 20-25 నియోజకవర్గాలపై ఉండే అవకాశం ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. మరోవైపు.. షెట్టర్‌ విషయంలో బీజేపీ హైకమాండ్ చర్యను ఖండిస్తూ హుబ్బళ్లి-ధార్వాడ్ సిటీ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న 16 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఇక, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ సహా 12 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా విడుదల చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 212 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇదిలాఉండగా, ఈ ఎన్నికల్లో షెట్టర్‌ను తన సీటు వదులుకోవాలని ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌ సూచించింది. దీంతో, షెట్టర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. 

మరిన్ని వార్తలు