రామాలయ పూజకు రాజకీయ రంగు

28 Jul, 2020 20:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల ఆకాంక్ష అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓవైపు చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు భూమి పూజపై రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ఆగస్ట్‌ 5 జరగబోయే రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ సీనియర్‌ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు, పూర్వ సంఘ్‌ నేతలను సైతం కీలక ఘట్టానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ  ప్రారంభ కార్యక్రమంపై  భిన్న స్వరాలతో పాటు రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లౌకిక రాజ్యమైన భారతదేశంలో ఓ వర్గానికి చెందిన దేవాలయ పూజా కార్యక్రమానికి ప్రధానమంత్రి ఎలా హాజరవుతారంటూ హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలతో రాజకీయ వేడిని లేపారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక)

మరోవైపు  ఆలయ శంకుస్థాపక కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడ్డ ఉద్ధవ్‌ ఠాక్రే పేరు లేదని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆల్‌లైన్‌ వేదికగా జరపాలన్న ఠాక్రే వ్యాఖ్యలపై మోహన్‌ భగవత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం పట్ల శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ముంబై వర్గాల సమాచారం. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శివసేన ఎంతో పాటుపడిందని, ఎన్నో కార్యక్రమాలకు ఠాక్రే పిలుపునిచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇదిలావుండగా.. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆలయ నిర్మాణం చేపట్టడంపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సైతం పలు వ్యాఖ్యలు చేశారు. (ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు)

రామాలయ నిర్మాణంతో కరోనా అంతమయిపోతుందన్న భ్రమను కొంతమంది నేతలు కల్పిస్తున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభంలో లేనిపోని హడావిడిని ప్రదర్మిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా ఆగస్ట్‌ 5 జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటినే ఆహ్వానాలను పంపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అ‍ద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతీ, కళ్యాస్‌ సింగ్‌, యోగి ఆదిత్యానాథ్‌, మోహన్‌ భగవత్‌లకు ఆహ్వానం పంపింది. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలు సైతం హాజరవుతారని సమాచారం.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు