ఏడింట్లో నాలుగు బీజేపీకి...

7 Nov, 2022 06:14 IST|Sakshi
ధామ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణుల సంబరం

ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి

న్యూఢిల్లీ: ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఇందులో నాలుగు బీజేపీ గెలుచుకోగా, ఆర్‌జేడీ, శివసేన ఠాక్రే వర్గం, టీఆర్‌ఎస్‌ తలొకటి దక్కించుకున్నాయి. యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. పార్టీకి చెందిన అమన్‌ గిరి సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని 34 వేల ఓట్ల తేడాతో ఓడించారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బీజేపీకి చెందిన కుసుమ్‌ దేవి సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీకి చెందిన మోహన్‌ గుప్తాపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు.

ఇదే రాష్ట్రంలోని మొకామాలో ఆర్‌జేడీ అభ్యర్థిని నీలం దేవి 16వేల ఓట్ల మెజారిటీ గెలిచారు. ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేడీకి చెందిన అవంతిదాస్‌పై బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్‌ 4,845 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణలోని మునుగోడు నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన కె.ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ముంబైలోని అంధేరి (వెస్ట్‌)నియోజకవర్గం నుంచి శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన రుతుజా లట్కే విజయం సాధించారు.  ఎమ్మెల్యే రమేశ్‌ లట్కే గత  మృతి చెందడంతో  ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేశ్‌ భార్య రుతుజకు పోటీగా  బీజేపీ సహా  ప్రధానపార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. రెండో స్థానంలో 14.79 శాతం మంది నోటాకు ఓటేశారు.

భజన్‌లాల్‌ మనవడి విజయం
హరియాణాలోని ఆదంపూర్‌లో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్‌ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జై ప్రకాశ్‌పై 16 వేల మెజారిటీ సాధించారు. మాజీ సీఎం భజన్‌లాల్‌ కుటుంబానికి 1968 నుంచి ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. భజన్‌లాల్‌ 9 సార్లు, ఆయన భార్య ఒక పర్యాయం, కుమారుడు కుల్దీప్‌ బిష్ణోయ్‌ 4 సార్లు ఇక్కడ విజయం సాధించారు. భజన్‌లాల్‌ మనవడే భవ్య బిష్ణోయ్‌. కుల్దీప్‌ బిష్ణోయ్‌ ఆగస్ట్‌లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. 

మరిన్ని వార్తలు