బిహార్‌లో ముగిసిన తొలి దశ పోలింగ్‌

28 Oct, 2020 19:06 IST|Sakshi

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత 71 స్ధానాలకు పోలింగ్‌ బుధవారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 52.24 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. పోలింగ్‌ జరిగిన 71 స్ధానాల్లో ఆర్జేడీ 42 మంది అభ్యర్ధులను బరిలో దింపగా, జేడీయూ తరపున 35, బీజేపీ 29, కాంగ్రెస్‌ 21, సీపీఐ-ఎంఎల్‌ 8, హెచ్‌ఏఎం ఆరుగురు అభ్యర్ధులను బరిలో నిలిపాయి.

ఇక ఇతర పార్టీల తరపున ఆర్‌ఎల్‌ఎస్పీ నుంచి 43, ఎల్జేపీ 41, బీఎస్పీ నుంచి 27 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. సోమవారంతో ముగిసిన తొలి విడత పోలింగ్‌ ప్రచారంలో పలు పార్టీల తరపున అగ్రనేతలు, సీనియర్‌ నేతలు ప్రచార పర్వాన్ని వేడెక్కించారు. ఇక జేడీయూ చీఫ్‌, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నాలుగోసారి అధికార పీఠంపై కన్నేశారు. బీజేపీతో కలిసి ముందుకు సాగుతుండగా ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఇతర పార్టీలు కలిసి మహాకూటమిగా జట్టుకట్టాయి. నితీష్‌ సర్కార్‌పై నెలకొన్న అసంతృప్తి తమకు అనుకూలిస్తుందని మహాకూటమి ఆశలు పెట్టుకుంది.

ఇక కరోనా సంక్షోభం నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. మరోవైపు కోవిడ్‌ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది గూమిగూడకుండా ఒక్కో పోలింగ్‌బూత్‌కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించారు. ఈవీఎంలను తరచుగా శానిటైజ్‌ చేశారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. చదవండి : బిహార్‌ ఎన్నికలు: ‘అత్యాచారం చేసి చంపేసేవారు’

మరిన్ని వార్తలు