కనిపించని శత్రువుపై పోరాటం.. ఇదే తొలి తీర్పు

22 Dec, 2020 18:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెద్దయ్యాక ఫైలట్‌ అయి విహంగంలా ఆకాశంలో దూసుకుపోవాలని కలలుగన్న తొమ్మిదేళ్ల ఎల్లా అడూ కిస్సీ అన్యాయంగా అసువులు బాసింది. వాతావరణ కాలుష్యం కారణంగా అర్థాంతరంగా ఆస్తమా రావడంతో ఊపిరి తీసుకోవడానికి ఉక్కిరిబిక్కిరై శాశ్వతంగా ఊపిరి తీసుకోవడం ఆపేసింది. అన్యాయంగా తల్లిని వదిలేసి తనువు చాలించింది. దక్షిణ లండన్‌లోని లెవిషమ్‌లో ఉంటోన్న తల్లి రోసాముండ్, డ్రామా, డ్యాన్స్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌ లాంటి పలు విద్యలతోపాటు గిటార్, పియానో, డ్రమ్స్‌లోనూ ప్రావీణ్యం గల తన కూతురుకు ఇలా జరగుతుందని ఎన్నడూ ఊహించలేక పోయింది. కూతురు కోసం ఏడ్చి ఏడ్చి అలసి పోయింది.

విష వాయువులు వల్లనే మరణం..
సెకండరీ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోన్న రోసాముండ్‌ తన కూతురుకు జరిగిన అన్యాయం పిల్లలెవరికీ జరగకూడదనే సంకల్పానికి వచ్చి కన్న పేగును బలితీసుకున్న కనిపించని కాలుష్యానికి వ్యతిరేకంగా కన్నెర్ర చేశారు. కూతురు చనిపోయిన 2013 సంవత్సరం నుంచే న్యాయపోరాటం చేపట్టారు. తమ ఇంటి ప్రాంతంలోని వాతావరణంలో నైట్రోజెన్‌ డయాక్సైడ్‌తోపాటు ఇతర విష వాయువులు ఎక్కువగా ఉండడం వల్లనే తన కూతురు మరణించిందని, ఏం చేసినా తన కూతురు తిరిగి రాదనే విషయం తనకు తెలుసునని, తన కూతురు లాగా ఇతర పిల్లలుగానీ, పెద్దలుగానీ మరణించడానికి వీల్లేదంటూ వాదించారు. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ప్రజల ప్రాథమిక హక్కని, ఆ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదంటూ డిమాండ్‌ చేశారు.

గత బుధవారం తుది తీర్పు రోజు సౌత్‌వార్క్‌ కరోనర్స్‌ కోర్టుకు చేరుకున్న రోసాముండ్‌కు హాలీవుడ్‌ అలనాటి నటుడు ష్వార్జ్‌నెగ్గర్‌ వాట్సాన్‌ కాల్‌ చేసి విజయం సాధించాలంటూ విశెష్‌ చెప్పారు. ఆయన సంస్థ వియన్నాలో 2019, మే నెలలో జరిగిన కాలుష్య వ్యతిరేక సదస్సు ఆహ్వానంపై వెళ్లినప్పుడు ఆమెను ష్వార్జ్‌నెగ్గర్‌ స్వయంగా కలసుకున్నారు. రోసాముండ్‌ చేసిన న్యాయ పోరాటానికి 2014లోనే ‘అక్యూట్‌ రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌’గా ధ్రువీకరించిన కోర్టు,  తాజాగా తీర్పునిస్తూ ఎల్లా అడూ రెస్సిరేటరీ ఫెయిల్యూర్‌కు ఆమె ఇంటి చుట్టు పక్కలున్న వాతావరణంలోని మోతాదుకు మించిన కాలుష్యమే కారణమని తీర్పు చెప్పింది. ఆ మేరకు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను తాజా తీర్పులో కోర్టు ఆదేశించింది.


 ఏటా 70 లక్షల మంది మృతి
ఇలాంటి తీర్పు కోర్టు నుంచి రావడం ఒక్క బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి సారి కావచ్చని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. కాలుష్యానికి బ్రిటన్‌లో ఏటా 64 వేల మంది మరణిస్తుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా వాతావరణ కాలుష్యం వల్ల 70 లక్షల మంది మరణిస్తున్నారు. ఏడేళ్లపాటు వాతావరణ కాలుష్యంపై పోరాటం జరిపిన రోసాముండాను కలుసుకునేందుకు బ్రిటన్‌ పర్యావరణ వేత్తలు క్యూలు కట్టగా, ఇప్పటికే ఆమె పోరాటాన్ని తెరకెక్కించేందుకు పలువురు హాలీవుడ్‌ నిర్మాతలు ఆమెను కలుసుకున్నారు. వారందరికి రోసాముండా అవునని గానీ కాదనిగానీ చెప్పకుండా ‘నా కూతురు మరణం వృధా కారాదు’ అని చెప్పారు. 

మరిన్ని వార్తలు