క్యాథలిక్‌గా కార్డినల్‌గా తొలి తెలుగు వ్యక్తి & దళితుడు.. పూల ఆంథోనీ, పోప్‌ ఫ్రాన్సిస్‌ సమక్షంలో..

27 Aug, 2022 11:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్చిబిషప్‌ పూల ఆంథోనీ(60) క్యాథలిక్‌ కార్డినల్‌గా ప్రకటించబడ్డ విషయం తెలిసిందే. కేథలిక్కుల మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌.. వాటికన్‌ సిటీ(ఇటలీ) సెయింట్‌ పీటర్స్‌ బాసిలికాలో ఇవాళ పూల ఆంథోనీని కార్డినల్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ కర్నూల్‌కు చెందిన పూల ఆంథోనీ.. కార్డినల్‌ హోదా అందుకోబోయే తొలి దళితుడు కూడా. 

ఇవాళ(ఆగస్టు 27న) జరగబోయే కొత్త కార్డినల్స్‌ పరిషత్‌ సమావేశానికి కూడా పూల ఆంథోనీ హాజరుకానున్నారు. ఇక కేథలిక్‌ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్‌ హోదాలో.. పోప్‌ ఎన్నికలో పాల్గొనే అవకాశం పూల ఆంథోనీకి ఉంటుంది. ఆంథోనీతో పాటు భారత్‌ నుంచి గోవా, డామన్‌ ఆర్చి బిషప్‌ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో కూడా కార్డినల్‌ ర్యాంక్‌ పొందిన వాళ్లలో ఉన్నారు.

నేపథ్యం.. 
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ..  1992లో మొదటిసారిగా కడపలో క్రైస్తవ మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్‌ ఆర్చిబిషప్‌ అయ్యారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్‌ ఆర్చిబిషప్‌ హోదాలోనూ కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం

మరిన్ని వార్తలు