విదేశాల్లో భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్

2 Dec, 2020 05:19 IST|Sakshi

ఎన్నికల సంఘం ప్రతిపాదన 

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉండే భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వర్తింప జేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) యోచిస్తోంది. కేంద్రం అనుమతిస్తే.. ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టం(ఈటీపీబీఎస్‌)ను విదేశాల్లోని అర్హులైన భారతీయ ఓటర్లు కూడా వినియోగించుకునే వీలుం టుంది. ఈ మేరకు ఈసీ నవంబర్‌ 27వ తేదీన న్యాయశాఖకు లేఖ రాసింది. ఇప్పటికే భద్రతా బలగాలకు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందున విదేశాల్లోని భారతీ యులకు కూడా అందుబాటు లోకి తేగలమనే నమ్మకం ఉందని అందులో తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌– జూన్‌ నెలల్లో అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సదుపాయాన్ని అమలు చేసేందుకు సాంకేతికంగా, పాలనాపరంగా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

విదేశాల్లో ఉండే అర్హులైన భారతీయ ఓటర్లు ఓటు హక్కు వినియో గించుకునేందుకు స్వదేశానికి రావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహా రమని, బదులుగా పోస్టల్‌ బ్యాలెట్‌ వెసులు బాటును కల్పించాలం టూ పలు విజ్ఞప్తులు అందాయని వివరించింది. కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ నేపథ్యంలో ఈ సమస్య మరింత సంక్లిష్టమైందని న్యాయశాఖకు తెలిపింది. ఈటీపీబీఎస్‌ కోసం విదేశాల్లో ఉండే భారతీయులు ముందుగా తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తు న్నట్లు రిటర్నింగ్‌ అధికారికి సమాచారం అందించాలి. అప్పుడే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందుతుంది. ఓటరు ఆ బ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రత్యేక ఎన్వలప్‌లో తన ఓటు నమోదై ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు ఆ బ్యాలెట్‌ చేరుకుంటుంది. లెక్కింపు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతోనే మొదలవుతుంది.  

మరిన్ని వార్తలు