ముంబైలో పవర్‌ కట్‌

13 Oct, 2020 04:14 IST|Sakshi
ముంబైలో చీకట్లో బ్యాటరీ సాయంతో అమ్మకాలు సాగిస్తున్న మహిళ

2 గంటల తర్వాత పాక్షికంగా సరఫరా పునరుద్ధరణ

ఈ పరిణామంపై విచారణకు ఆదేశించిన సీఎం ఉద్ధవ్‌

ముంబై: ముంబై సోమవారం విద్యుత్‌ అంతరాయంతో స్తంభించింది. ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్‌ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కోవిడ్‌ కారణంగా ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానంలో లక్షలాది మంది ఇళ్లలో ఉండి అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్, ఇతర అత్యవసర రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల కోసం డీజిల్‌ జనరేటర్‌లను యంత్రాంగం తరలించాల్సి వచ్చింది.  యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటలకు సేవలను క్రమక్రమంగా పునరుద్ధరించగలిగింది.

కాగా, ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యుత్, తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్‌ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్‌ అంతరాయం ఘటనపై తక్షణం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ(ఎంఎస్‌ఈటీసీఎల్‌)కు చెందిన కల్వా– ఖర్ఘార్‌ సబ్‌స్టేషన్లలో మెయింటెనెన్స్‌ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో అంతరాయం ఏర్పడిందని విద్యుత్‌ మంత్రి నితిన్‌ తెలిపారు. లోడ్‌ భారమంతా మోస్తున్న రెండో సర్క్యూట్‌లో లోపం తలెత్తడమే ఇందుకు కారణమన్నారు.

కల్వా సబ్‌స్టేషన్‌ వరకు విద్యుత్‌ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర విద్యుత్‌ సంస్థది కాగా, అక్కడి నుంచి టాటా, అదానీ సంస్థలు నగరానికి సరఫరా చేస్తుంటాయన్నారు. ముంబైతోపాటు సబర్బన్‌లోని థానే, పన్వెల్, డోంబివిలి, కల్యాణ్‌లో విద్యుత్‌ అంతరాయం తలెత్తింది. కంపెనీలు, సంస్థల్లో మాదిరిగా బ్యాక్‌–అప్‌ సౌకర్యం లేని ఇళ్లలోని లక్షలాది మంది ఉద్యోగుల ‘వర్క్‌ ఫ్రం హోం’ సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయడంతో కోవిడ్‌ వైద్య కేంద్రాల్లోని వారి కోసం డీజిల్‌ జనరేటర్లను, సినిమా షూటింగ్‌ల కోసం వాడే మొబైల్‌ డీజిల్‌ జనరేటర్లను తెప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేయించేందుకు ఏర్పాటు చేసిన రెండు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఒకటి పనిచేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఓ అధికారి వివరించారు.
 

మరిన్ని వార్తలు