కరెంటుకు కటకట

30 Apr, 2022 06:31 IST|Sakshi

16 రాష్ట్రాల్లో తీవ్ర కోతలు 

అడుగంటుతున్న బొగ్గు నిల్వలు

బొగ్గు సరఫరా కోసం 657 రైళ్ల రద్దు

రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 207 గిగావాట్ల వినియోగం

జనం బాధలు పట్టవా: రాహుల్‌

న్యూఢిల్లీ: మండే ఎండలతో ఓవైపు అల్లాడుతున్న జనానికి కరెంటు కోతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, యూపీ సహా 16కి పైగా రాష్ట్రాల్లో డిమాండ్‌ పీక్స్‌కు చేరింది. సరిపడా కరెంటు పంపిణీ చేయలేకపోవడంతో గంటల తరబడి కోతలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం భారీగా పెరిగింది.

శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు దేశ చరిత్రలోనే అత్యధికంగా 207.11 గిగావాట్లకు చేరిందని కేంద్ర విద్యుత్‌ శాఖ ట్వీట్‌ చేసింది. కేంద్రం చేతగానితనమే విద్యుత్‌ సంక్షోభానికి కారణమంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ మరోసారి దుయ్యబట్టారు. ‘‘మోదీ జీ! దేశమన్నా, ప్రజలన్నా మీకు అస్సలు పట్టదా?’’ అంటూ నిలదీశారు. ఇకనైనా విద్వేషపు బుల్డోజర్లను ఆపి విద్యుత్కేంద్రాలను నిరంతరాయంగా నడపడంపై దృష్టి పెట్టాలన్నారు.

ఢిల్లీలో ఒక్క రోజు బొగ్గు నిల్వలే
థర్మల్‌ విద్యుత్‌పైనే అత్యధికంగా ఆధారపడ్డ నేపథ్యంలో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సకాలంలో అందక సంక్షోభం ముంచుకొచ్చింది. ఢిల్లీలో ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గు అందకుంటే ఆస్పత్రులకు, మెట్రోకు కరెంటివ్వలేమని కేజ్రివాల్‌ ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇప్పటిదాకా ఎలాగోలా సర్దుబాటు చేశాం. పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి’’ అంటూ కేజ్రివాల్‌ ట్వీట్‌ చేశారు.

విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపిణీకి వీలుగా 657 పాసింజర్‌ రైళ్లను కేంద్రం నిరవధికంగా రద్దు చేసింది. వాటికి బదులు యుద్ధప్రాతిపదికన బొగ్గు వాగన్లను రవాణా చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది. 165 థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు గాను సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం 56 కేంద్రాల్లో 10% బొగ్గు నిల్వలే ఉన్నాయి. 26 కేంద్రాల్లోనైతే 5% కంటే తక్కువకు పడిపోయాయి. బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా లేకుంటే నిరంతరాయ విద్యుత్‌ పంపిణీ వీలు పడదు.

కేంద్రం వర్సెస్‌ కేజ్రివాల్‌
ఢిల్లీలో డిమాండ్‌ రోజుకు 6 వేల మెగావాట్లకు పెరగడంతో పంపిణీ కష్టంగా మారింది. బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెప్పగా, అదేమీ లేదంటూ ఎన్‌టీపీసీ ట్వీట్‌ చేసింది. ‘‘ఢిల్లీకి కరెంటు సరఫరా చేసే ఉంచహార్, దాద్రి విద్యుత్కేంద్రాలు 100% సామర్థ్యంతో పని చేస్తున్నాయి. బొగ్గు పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. దాద్రిలో 1.4 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఉంచహార్‌లోని ఐదు యూనిట్లలో 95 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి’’ అని చెప్పింది.
 

మరిన్ని వార్తలు