ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల బిగింపునకు గడువు

20 Aug, 2021 05:01 IST|Sakshi

కేంద్ర విద్యుత్‌ శాఖ నోటిఫికేషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయేతర విద్యుత్తు వినియోగదారులకు ప్రీపెయిడ్‌ సౌకర్యం ఉండే స్మార్ట్‌ మీటర్ల ద్వారా మాత్రమే విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆయా మీటర్ల బిగింపునకు నిర్దిష్ట కాల వ్యవధిని నోటిఫై చేస్తూ కేంద్ర విద్యుత్తు శాఖ గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.  

2023 డిసెంబర్‌ నాటికి గడువు ఉన్న కేటగిరీలు
► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 15 శాతానికంటే మించిన ఎలక్ట్రిక్‌ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో కొత్తగా ప్రీపెయిడ్‌ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ మీటర్లు అమర్చాలి.  
► అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు 25 శాతం మించిన ఎలక్ట్రికల్‌ డివిజన్లలో కూడా స్మార్ట్‌ మీటర్లు అమర్చాలి.  
► బ్లాక్‌ స్థాయి, ఆపైస్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ స్మార్ట్‌ మీటర్లు అమర్చాలి.
► పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లు అమర్చాలి.
► స్టేట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ తగిన కారణాలు చూపి ఈ కాలవ్యవధిని రెండుసార్లు మాత్రమే పొడిగించవచ్చు. ఒక్కో విడత ఆరు నెలల కంటే ఎక్కువగా పొడిగింపు ఉండరాదు.  
► ఇతర అన్ని ప్రాంతాల్లో స్మార్ట్‌ మీటర్లను 2025 మార్చి వరకు అమర్చాలి.  

ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు
► అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు ఆటోమేటిక్‌ మీటర్‌ రీడింగ్‌ సౌకర్యం ఉన్న మీటర్లుగానీ, అడ్వాన్స్‌డ్‌ మీటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వసతి ఉన్న మీటర్లు గానీ అమర్చుతారు. 2022 డిసెంబర్‌ నాటికి ఈ మీటర్లను అమర్చాలి.  
► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు(ఏటీఅండ్‌సీ) 15 శాతాని కంటే మించిన ఎలక్ట్రిక్‌ డివిజన్లలోని డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు, 25 శాతానికి మించి నష్టాలు ఉన్న ఇతర అన్ని ఎలక్ట్రికల్‌ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో డిసెంబర్‌ 2023 నాటికి కొత్తగా మీటర్లు అమర్చాలి. ఇతర ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి మీటర్లు అమర్చాలి.  

మరిన్ని వార్తలు