ప్రచండ్‌ హెలికాఫ్టర్‌.. ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’

3 Oct, 2022 15:14 IST|Sakshi

జైపూర్‌: భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్‌ ఇన్‌ ఇండియా ఘనత వచ్చి చేరింది. తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్‌(LCH) ‘ప్రచండ్‌’ను ఇవాళ(సోమవారం) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. 

దేశీవాళీ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ ‘ప్రచండ్‌’ను జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, ఐఏఎఫ్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వ్‌ ధరమ్‌ ప్రార్థన సైతం నిర్వహించారు. 

చాలా కాలంగా.. దాడుల కోసం తేలికపాటి హెలికాప్టర్ల అవసరం ఉంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆ అవసరాన్ని తీవ్రంగా భావించింది మన సైన్యం. LCH అనేది రెండు దశాబ్దాల పరిశోధన-అభివృద్ధి ఫలితం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రచండ్‌ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయి. ప్రచండ్‌ సమర్థవంతంగా శత్రు నిఘా నుంచి తప్పించుకోగలదు. వివిధ రకాల మందుగుండు సామగ్రిని మోసుకెళ్ళగలదు. దానిని త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు. ఇది వివిధ భూభాగాలలో మన సాయుధ దళాల అవసరాలను సంపూర్ణంగా తీరుస్తుంది. ఇది మన సైన్యం, వైమానిక దళం రెండింటికీ ఆదర్శవంతమైన వేదిక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.

ప్రచండ్‌ తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్‌ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(HAL) రూపొందించింది. 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తులో గణనీయంగా ఆయుధాలు, ఇంధనంతో.. భారత సాయుధ దళాల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రచండ్‌ ల్యాండ్-టేకాఫ్ చేసుకోగలదు. ప్రపంచంలోనే ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం.

అవసరమైన చురుకుదనం, యుక్తి, విస్తరించిన శ్రేణి, అధిక ఎత్తులో పనితీరు, అన్ని వేళలా.. వాతావరణం ఎలాంటిదైనా సరే పోరాట సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ప్రచండ్‌. భారత సైన్యం.. ప్రత్యేకించి వైమానిక దళం కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ప్రచండ్‌ ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని అధికారులు చెప్తున్నారు.

మార్చిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) రూ. 3,887 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 15 పరిమిత శ్రేణి ఉత్పత్తి (LSP) తేలికపాటి యుద్ధ విమానాల సేకరణకు ఆమోదం తెలిపింది. IAF కోసం పది హెలికాప్టర్లు, భారత సైన్యం కోసం ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: 8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు

మరిన్ని వార్తలు