సివిల్స్‌ టాపర్‌ ప్రదీప్‌ సింగ్‌ 

5 Aug, 2020 04:13 IST|Sakshi

రెండు, మూడో స్థానాల్లో జతిన్‌ కిశోర్, ప్రతిభ వర్మ  

ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తూ మరింత అత్యున్నత సర్వీసు  

ముగ్గురూ ఉత్తరాది అభ్యర్థులే..  

సివిల్‌ సర్వీసెస్‌–2019 ఫలితాలు విడుదల  

మొత్తం 829 మందితో జాబితా  

విత్‌ హెల్డ్‌లో మరో 11 మంది అభ్యర్థుల ఫలితాలు

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌–2019 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 829 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్‌ వంటి అత్యున్నత సర్వీసులకు ఎంపికయ్యారు. వీరిలో ప్రదీప్‌ సింగ్‌(హరియాణా) మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానం జతిన్‌ కిశోర్‌(ఢిల్లీ), మూడో స్థానం ప్రతిభ వర్మ(ఉత్తర ప్రదేశ్‌) దక్కించుకున్నారు. వీరిద్దరూ ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. మరో 11 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపి వేసినట్లు(విత్‌ హెల్డ్‌) యూపీఎస్సీ వెల్లడించింది. ఫలితాలు, నియామకాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా అభ్యర్థులు 011–23385271/ 23381125/23098543 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. పూర్తి సమాచారం ఠీఠీఠీ.upటఛి.జౌఠి.జీn వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని తెలియజేసింది.  

కల నెరవేరింది  
29 ఏళ్ల  ప్రదీప్‌ సింగ్‌ ఇప్పటికే ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారిగా సేవలందిస్తున్నారు. ఫరీదాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్, నార్కోటిక్స్‌(ఎన్‌ఏసీఐఎన్‌)లో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించారు. సివిల్స్‌లో అగ్రస్థానంలో నిలవడంతో తన కల నెరవేరిందని, ఐఏఎస్‌ అధికారిగా సమాజంలో అణగారిన వర్గాలకు సేవలందించాలన్నదే తన లక్ష్యమని ప్రదీప్‌ చెప్పారు. విద్యా, వ్యవసాయ రంగాలను మరింత మెరుగుపర్చాలన్నదే తన కోరిక అన్నారు. ఆయన సొంతూరు హరియాణాలోని సోనీపట్‌. చాలారోజులు సెలవు పెట్టి, సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ప్రదీప్‌ సింగ్‌ తన సొంత రాష్ట్రం హరియాణా క్యాడర్‌నే ఎంచుకున్నారు. సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.  

రెండో ప్రయత్నంలో రెండో ర్యాంకు  
సివిల్స్‌ రెండో ర్యాంకర్, 26 సంవత్సరాల జతిన్‌ కిశోర్‌ 2018 బ్యాచ్‌ ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(ఐఈఎస్‌) అధికారి. సివిల్స్‌లో ఇది తన రెండో ప్రయత్నమని, ఈసారి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని జతిన్‌ కిశోర్‌ తెలిపారు. 

మహిళా సాధికారత కోసం కృషి చేస్తా..  
సివిల్‌ సర్వీసెస్‌ మూడో ర్యాంకర్‌ ప్రతిభ వర్మ ఇప్పటికే ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఇన్‌కం ట్యాక్స్‌) అధికారిగా పని చేస్తున్నారు. ఆమె సివిల్స్‌–2018లో 489వ ర్యాంకు సాధించారు. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో పని చేస్తానని, మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. 

మరిన్ని వార్తలు