అణగారిన వర్గాల కోసం పని చేస్తాను: ప్రదీప్‌ సింగ్‌

4 Aug, 2020 19:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రదీప్‌ సింగ్‌ పేరు ప్రస్తుతం ట్విట్టర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. నేడు ప్రకటించిన యూపీఎస్సీ-2019 ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా వీరందరికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సివిల్ సర్వీసెస్ పరీక్ష, 2019ని విజయవంతంగా క్లియర్ చేసిన వారందరికీ నా అభినందనలు! ప్రజా సేవకు సంబంధించి ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన వృత్తి మీ కోసం వేచి ఉంది. నా శుభాకాంక్షలు!’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో పాటు ఇతర నాయకులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభినందనలు తెలిపారు. నేడు ప్రకటించిన ఫలితాల్లో​ ప్రదీప్‌ సింగ్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా.. తరువాతి స్థానాల్లో జతిన్‌ కిషోర్‌, ప్రతిభా వర్మ ఉన్నారు.
 

ఇక ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన ప్రదీప్‌ సింగ్‌ హరియాణా సోనిపట్‌ జిల్లాకు చెందినవారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘కల నిజమైతే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇది నాకు ఆనందకరమైన ఆశ్చర్యం. నేను ఐఏఎస్‌ కావాలని ప్రతిక్షణం పరితపించాను. సమాజంలోని అణగారిన వర్గాల కోసం పని చేస్తాను’ అని తెలిపారు. గ‌త ఏడాది కూడా ప్రదీప్‌ సివిల్స్ క్లియ‌ర్ చేశారు.  ప్ర‌స్తుతం అత‌ను హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో ఇండియ‌న్ రెవ‌న్యూ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌గా శిక్ష‌ణ పొందుతున్నారు. సోనిపాట్ జిల్లాలోని తేవ్రీ గ్రామంలో నివసిస్తున్న ప్ర‌దీప్ తండ్రి సుఖ్‌బీర్ సింగ్.. గతంలో గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. 

>
మరిన్ని వార్తలు