ప్రతి నెల పదివేల పెన్షన్ కావాలా?

8 Apr, 2021 18:32 IST|Sakshi

దేశ వ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తుంది. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో సరికొత్త పెన్షన్ పథకం తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పథకంలో చేరడానికి గడువు తేదీని 2023 మార్చి 31 వరకు పొడగించింది. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. 

ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై వార్షిక ఆదాయం 7.66 శాతం వరకు పొందవచ్చు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు. 

అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు వారికీ ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనకకు తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది.

చదవండి: ఐదు రోజుల్లో రూ.2వేలు పెరిగిన బంగారం ధరలు!

మరిన్ని వార్తలు