‘‘కేజ్రీవాల్‌ జాతీయ జెండాను అవమానించారు’’

28 May, 2021 18:18 IST|Sakshi

ఢిల్లీ సీఎంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ప్రటేల్‌ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జాతీయ జెండాను అవమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. ఇటీవల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కూర్చున్న కుర్చీ వెనుకలా పెట్టిన జెండాలు జాతీయ హోంమత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా లేవని తెలిపారు. జెండాలోని ఆకుపచ్చ రంగును పెద్దదిగా చేసి.. వక్రీకరించారని, మధ్యలో ఉండే తెలుపుదనాన్ని తగ్గించారని ఆరోపించారు. దేశ జాతీయ జెండా నియమావళికి ఇది విరుద్ధమన్నారు ప్రహ్లాద్‌ పటేల్‌.

ఈ పొరపాటును వెంటనే సరిదిద్దాలని ప్రహ్లాద్‌ పటేల్‌ సూచించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ టెలివిజన్‌ బ్రీఫింగ్‌లో ప్రసంగించినప్పుడల్లా తన దృష్టి ఆయన కుర్చీ వెనుకలా ఉన్న జాతీయ జెండాలపైనే పడుతుందన్నారు ప్రహ్లాద్‌ పటేల్‌. కుర్చీ వెనుక పెట్టిన జాతీయ జెండాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని తెలిపారు. అలంకారం కోసం జాతీయ జెండాలను ఉపయోగిస్తున్నారని ప్రహ్లాద్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలోని తెలుపుదనం ఆకుపచ్చని రంగుతో తగ్గిపోయిందన్నారు. ‘‘ఈ పొరపాటు గురించి అరవింద్‌ కేజ్రీవాల్‌కు తెలుసో.. తెలియదో నాకు తెలియదు. నేను మాత్రం ఈ పొరపాటును కేజ్రీవాల్‌ దృష్టికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను’’ అన్నారు ప్రహ్లాద్‌ పటేల్‌. 

చదవండి: రాష్ట్రాలకు భంగపాటు! 

మరిన్ని వార్తలు