అర్నాబ్‌ అరెస్టు, పత్రికా స్వేచ్ఛపై దాడి: కేంద్రమంత్రి

4 Nov, 2020 10:33 IST|Sakshi

అర్నాబ్‌ అరెస్టు, కేంద్రమంత్రి వ్యాఖ‍్యలు

ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చింది: ప్రకాశ్‌ జవడేకర్‌

సాక్షి,న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ముంబై  పోలీసులు అరెస్టు చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ స్పందించారు. ఇది ‘‘పత్రికా స్వేచ్ఛపై దాడి" గా అభివర్ణించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన మీడియా పట్ల ఈ వైఖరి సరైంది కాదంటూ ట్వీట్‌ చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి అరెస్టు)

కాగా డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణలతో నమోదైన కేసును సాక్ష్యాలు లేవంటూ పోలీసులు దర్యాప్తును నిలిపివేశారు. అయితే రెండేళ్లనాటి కేసును తిరిగి ప్రారంభించాలన్న కుటుంబ సభ్యుల  విజ్ఞప్తి  నేపథ్యంలో  అర్నాబ్ గోస్వామిని  ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌, సాయుధులైన పోలీసులతో అర్నాబ్‌ను నిర్బంధించారని రిపబ్లిక్‌ టీవీ ఆరోపించింది. 

ఎడిటర్స్ గిల్డ్  ఖండన
మరోవైపు అర్నాబ్‌ అరెస్ట్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఆకస్మిక అరెస్టును ఖండించింది. అర్నాబ్‌ గోస్వామి అరెస్టు విషయం తెలిసి షాక్‌ అయ్యామంటూ విచారం వ్యక్తం చేసింది.   గోస్వామిని న్యాయపరంగా  విచారణ జరగాలని, మీడియా విమర్శనాత్మక రిపోర్టింగ్‌పై అధికార దుర్వినియోగం కాకుండా  చూసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించింది.

మరిన్ని వార్తలు