మిషన్‌ కర్మయోగికి కేబినెట్‌ ఆమోదం

2 Sep, 2020 15:35 IST|Sakshi

మూడు ఎంఓయూలకు ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ : ‘మిషన్‌ కర్మయోగి’ పేరిట సివిల్‌ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సివిల్‌ సర్వీసులపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్‌ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్‌ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. పౌర అధికారులను మరింత సృజనశీలురుగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా ఉండేలా దేశ భవిష్యత్‌ కోసం వారిని దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్‌ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు.

వారు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు. ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను ఒంటబట్టించుకునే పౌర అధికారులు భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరిచే క్రమంలో సామర్థ్య పెంపు దోహదపడుతుందని తెలిపారు. ఇక జమ్ము కశ్మీర్‌లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ, ఉర్దు, ఇంగ్లీష్‌లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. మరోవైపు జపాన్, ఫిన్‌లాండ్‌, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. చదవండి : షూటింగ్స్‌ ప్రారంభించుకోండి!

మరిన్ని వార్తలు