నేను చెప్పింది ఆ చాయ్‌వాలా గురించి..మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో?

22 Aug, 2023 08:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3పై అనుచిత వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోలేదు సరికదా దానిని సమర్ధించుకున్నాడు. 

ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. జులై 14న భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్)లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై  తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోకపోగా తాను పోస్ట్ చేసిన దానిని సమర్ధించుకున్నాడు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్.. అది అర్ధం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎట్లా? నేను కేరళ చాయ్‌వాలాని ఉద్దేశించి పోస్ట్ చేశాను.. మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో..? అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.  

చంద్రయాన్-3 పార్టీలకతీతంగా ప్రతి భారతీయుడు గర్వించాల్సిన ప్రయోగమని.. ఎవ్వరైనా ఆ వ్యత్యాసాన్ని గ్రహించి ప్రవర్తించాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు.  

ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా 

మరిన్ని వార్తలు