కోట్ల ఖర్చుతో కూతురి పెళ్లి, ఇప్పుడు దివాళా తీశాడు

23 Oct, 2020 12:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. లక్ష్మి మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను లండన్ హైకోర్టు దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించింది. లక్ష్మి మిట్టల్, ఆయన తండ్రి, భార్య, కొడుకు, బావ మరిది కలిసి వివిధ బ్యాంకులకు 2.5 బిలియన్‌ డాలర్లు బాకీ పడ్డారు.  ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన సోదరుడు లక్ష్మి మిట్టల్ భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు.  స్టీల్ మాగ్నెట్ ఆర్సెలర్ మిట్టల్, యూకేకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

2013 లో, ప్రమోద్ మిట్టల్ తన కుమార్తె శ్రీష్టి వివాహానికి ఏకంగా 50 మిలియన్‌ పౌండ్లు ఖర్చుపెట్టి వివాహం చేసి వార్తల్లో నిలిచారు. కోర్టు దివాళాగా ప్రకటించిన అనంతరం మిట్టల్‌ మాట్లాడుతూ, తనకంటూ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆదాయం ఏమి లేదని తెలిపారు. తన భార్య ఆర్థికంగా తనకు తాను సంపాదించుకుంటుందని, ఆమె ఆదాయానికి సంబంధించిన వివరాలు తెలియవని చెప్పారు. తన వ్యక్తిగత వ్యయం నెలకు సుమారు 2,000 పౌండ్ల నుంచి 3,000 పౌండ్ల వరకు అవుతుందని, ఆ భారాన్ని తన భార్య, కుటుంబ సభ్యులు భరిస్తున్నారని వెల్లడించారు.  ఇక తన దివాళాకు సంబంధించి చట్టపరమైన ఖర్చులను థర్డ్‌ పార్టీ భరిస్తుందని ప్రకటించారు.  

ప్రమోద్‌ పతనానికి  కారణం బోస్నియన్‌కు చెందిన గ్లోబల్ ఇస్పాట్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) అనే బొగ్గు కంపెనీకి హామీ ఇచ్చారు. ఆ సంస్థ 166 మిలియన్‌ డాలర్లను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. దీంతో ఆ సంస్థకు అప్పు ఇచ్చిన మార్గెట్‌ కంపెనీ ప్రమోద్‌ మిట్టల్‌ను అప్పు కట్టాల్సిందిగా కోరింది. దానిని చెల్లించడంలో ఆయన విఫలమయ్యాడు. మరోవైపు భారతదేశంలో కూడా రూ. 2,200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో కూడా ప్రమోద్‌ మిట్టల్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. 

చదవండి: బడా పారిశ్రామిక‌వేత్త‌ వంద కోట్ల విరాళం

మరిన్ని వార్తలు