సొంత ఊరిపై మమకారం

1 Sep, 2020 04:15 IST|Sakshi

ఏటా దుర్గాపూజ సమయంలో మిరాటిలోనే

కోల్‌కతా: ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రణబ్‌ ముఖర్జీ సొంతూరితో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎన్నడూ మరువలేదు. పశ్చిమ బెంగాల్లోని బీర్బూమ్‌ జిల్లాలోని మిరాటి గ్రామంలో ప్రణబ్‌ పుట్టారు. మిరాటిలోని మట్టిరోడ్ల నుంచి రాజకీయ పండితుడి దాకా...అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌ దాకా ఆయన ప్రస్థానం కొనసాగినా సొంతూరితో ఉన్న అనుబంధం మరింత బలపడిందే తప్ప తరిగిపోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉంటారు. ధోతి, కండువాతో సంప్రదాయ వస్త్రధారణలో ఆయన దుర్గాదేవికి హారతి ఇస్తారు. గత ఏడాది కూడా ప్రణబ్‌ దసరా సమయంలో అక్కడే గడిపారు. అయితే, చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఆ గ్రామం ఆయన లేకుండానే దుర్గా పూజను జరుపుకోనుంది. ఆయన మరణంతో ఈ గ్రామం మూగబోయింది. ఆయన సీనియర్‌ మంత్రి అయినా లేక రాష్ట్రపతి అయినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ప్రణబ్‌ దానే.  

ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసేవారు...
ఆయన ఇంట్లో జరిగే దుర్గాపూజ మా గ్రామంలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాల్లో ఐదురోజుల పాటు ఆయన ఇంట్లోనే అందరూ భోజనాలు చేస్తారు. ఇకపై మిరాటిలో జరిగే దుర్గాపూజ మాత్రం మునుపటిలా ఉండదు అని ప్రణబ్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన చటోరాజ్‌ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని అడిగేవారు.  ప్రణబ్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి  గ్రామస్తులంతా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ప్రణబ్‌ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునేముందు తన గ్రామం నుంచి పనసపండు తీసుకురమ్మని చెప్పారని ఆయన కొడుకు అభిజిత్‌ ముఖర్జీ ఇటీవల చెప్పారు. తాను ఆగస్టు 3న కోల్‌కతా నుంచి మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానన్నారు. ప్రణబ్‌ ఎంతో ఇష్టంగా ఆ పండును తిన్నారని పేర్కొన్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా