ప్రణబ్‌దా.. అల్విదా

1 Sep, 2020 00:37 IST|Sakshi

గుండెపోటుతో మరణించిన మాజీ రాష్ట్రపతి.. గత 3 వారాలుగా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స 

అంతకుముందు, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో శస్త్రచికిత్స 

చికిత్స సందర్భంగా కరోనా నిర్ధారణ 

గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై.. కోమాలోనే 

నేటి మధ్యాహ్నం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు 

రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల ప్రగాఢ సంతాపం 

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ దురంధరుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రణబ్‌.. సోమవారం సాయంత్రం మృతి చెందారు. సాయం త్రం 4.30 గంటల సమయంలో గుండెపోటుతో ప్రణబ్‌ మరణించారని వైద్యులు ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్‌లో ఆగస్టు 10న ఆయనకు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ప్రణబ్‌ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలను నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్‌లోని çశ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబం వెల్లడించింది. 

దాదాపు ఐదు దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులను ప్రణబ్‌ అధిష్టించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ రాజకీయ చిత్రపటంపై చెరగని ముద్ర వేసిన నేతగా పేరుగాంచారు. జీవితాంతం రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు పొందారు. ఎన్నో సంక్షోభాల నుంచి కాంగ్రెస్‌ పార్టీని విజయవంతంగా గట్టెక్కించిన ట్రబుల్‌ షూటర్‌గా ఆయన గుర్తుండిపోతారు. 2019లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో ఆయనను గౌరవించింది. ప్రణబ్‌కు ఒక కుమార్తె షర్మిష్ట, ఇద్దరు కుమారులు అభిజిత్‌ ముఖర్జీ, ఇంద్రజిత్‌ ముఖర్జీ ఉన్నారు. భార్య సువ్రా ముఖర్జీ 2015లో చనిపోయారు. ప్రణబ్‌ మృతి వార్తను మొదట ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ ట్వీటర్‌ ద్వారా ప్రకటించారు.  

ఒక శకం ముగిసింది 
ప్రణబ్‌ మృతితో దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రణబ్‌ మృతితో ఒక శకం అంతరించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజా జీవితంలో శిఖరసమానుడు ప్రణబ్‌. ఒక యోగిలా మాతృభూమికి సేవ చేశారు. గొప్ప కుమారుడిని కోల్పోయిన భారతదేశం శోకతప్తమయింది. ఆయన కుటుంబానికి, మిత్రులకు, దేశ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’అని ఆయన ట్వీట్‌ చేశారు. సంప్రదాయం, ఆధునికత.. జ్ఞానం, వివేచన కలగలసిన నేతగా ప్రణబ్‌ను రాష్ట్రపతి ప్రశంసించారు. 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ ప్రణబ్‌ ఆప్తుడని కొనియాడారు. శిఖరాయమాన దార్శనికుడిగా, అత్యుత్తమ విజ్ఞాన ఖనిగా ఆయనను అభివర్ణించారు. ‘భారత రత్న ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల దేశం యావత్తూ ఆవేదన చెందుతోంది. భారత దేశ అభివృద్ధి పథంపై తనదైన ముద్ర వేసిన నాయకుడు ప్రణబ్‌’అని ట్వీట్‌ చేశారు. ‘అనేక దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆర్థిక, ఇతర వ్యూహాత్మక మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రతో సేవలందించారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్‌. చర్చలకు బాగా సిద్ధమై వచ్చే నాయకుడు. గొప్ప వక్త. అంతే స్థాయిలో హాస్య స్ఫూర్తి ఉన్న నేత’అని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రణబ్‌కు పాదాభివందనం చేస్తున్న ఫొటోతో పాటు మరికొన్ని ఫొటోలను ఆయన తన ట్వీట్‌కు జతచేశారు.  

ఇక ముందు ఎలా? 
పార్టీలో సీనియర్‌ సహచరుడు ప్రణబ్‌ మృతిపై తన సంతాపాన్ని ఒక లేఖ ద్వారా కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ఆయన కూతురు షర్మిష్టకు తెలియపరిచారు. గత ఐదు దశాబ్దాల ప్రణబ్‌ జీవితం.. యాభై ఏళ్ల దేశ చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తుందని సోనియా అందులో కొనియాడారు. ‘ప్రణబ్‌దా దేశ చరిత్రలో, కాంగ్రెస్‌ ప్రస్థానంలో విస్మరించలేని భాగం. ముందు చూపు, విజ్ఞానం, అనుభవం, అద్భుత అవగాహనతో కూడిన ఆయన సలహాలు, సూచనలు లేకుండా ఇక ముందు ఎలా సాగుతామనేది ఊహించలేకుండా ఉన్నాం. నిర్వహించిన ప్రతీ పదవికీ ఒక దిశానిర్దేశం చేసిన నాయకుడు ఆయన. పార్టీలకు అతీతంగా అందరు నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేత. గొప్ప అంకితభావంతో దేశసేవ చేశారు’అని ప్రశంసించారు.  

వారం పాటు సంతాపం 
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రణబ్‌ మృతికి సంతాపసూచకంగా ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో జాతీయ పతాకం సగం వరకు అవనతం చేస్తారని తెలిపింది.
 
బెంగాల్‌ నుంచి ప్రారంభం.. 
ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం 1969లో పశ్చిమబెంగాల్‌లో ప్రారంభమైంది. ఆ క్రమంలో ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయ నేతగా కాంగ్రెస్‌ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. ఇతర సీనియర్‌ మంత్రులున్నప్పటికీ.. ప్రధాని ఇందిర తరువాత ఆమె మంత్రివర్గంలో నెంబర్‌ 2గా నిలిచారు. అయితే, ఇందిర మరణం అనంతరం పార్టీకి కొంతకాలం దూరమయ్యారు. తరువాత, ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆ తరువాత విదేశాంగ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో సోనియాకు విశ్వసనీయ సహచరుడిగా, కీలక వ్యూహకర్తగా, సంక్షోభ నివారణ నిపుణుడిగా కాంగ్రెస్‌ పార్టీలో పేరుగాంచారు. ప్రభుత్వ విధుల్లోనూ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను అత్యంత ప్రతిభా సామరŠాధ్యలతో నిర్వహించారు. 47 ఏళ్ల వయస్సులోనే ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇందిర మరణం అనంతరం ఒకసారి, రాజీవ్‌ మృతి తరువాత మరోసారి ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఆయనకు తృటిలో చేజారింది. ప్రణబ్‌ 7 సార్లు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో.. విరుద్ధ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న ప్రధాని మోదీతోనూ ఆయన సత్సంబంధాలను కొనసాగించడం విశేషం.

మరిన్ని వార్తలు