‘సెప్టిక్‌ షాక్‌’లోకి ప్రణబ్‌ ముఖర్జీ

31 Aug, 2020 16:15 IST|Sakshi

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఆరోగ్యాన్ని మరింత కుంగదీసింది: వైద్యులు

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన‍్నట్లు ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఆయన ఆరోగ్యాన్ని మరింత కుంగదీసిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నిన్నటి నుంచి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన ‘సెప్టిక్‌ షాక్‌’లోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రణబ్‌ డీప్‌ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్‌ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్‌ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. (చదవండి: ఆస్పత్రి నుంచి అమిత్‌ షా డిశ్చార్జ్‌)

సాధారణంగా ‘సెప్టిక్ షాక్‌’కి గురయ్యే వ్యక్తుల్లో గుండె, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతినడం, బీపీ తీవ్రంగా పడిపోవడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్‌లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. ఇక ప్రణబ్‌ ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్న అతని కుమారుడు అభిజిత్ ముఖర్జీ ‘ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం క్లిష్టంగానే ఉందని..  కానీ అతని కీలకమైన పారామీటర్స్‌ అన్ని స్థిరంగా ఉన్నాయి’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు