త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి: అభిజిత్‌ ముఖర్జి

19 Aug, 2020 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్‌ ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే కొనసాగతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జి ట్వీట్‌ చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్‌–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. (ప్రణబ్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు)

తండ్రిని గుర్తు చేసుకుంటూ శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్‌ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్‌ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా  ప్రణబ్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరం కాలేదన్నారు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం తనకుంది అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్‌ ఫోటోలను ఆమె షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు