ప్రణబ్‌కు నివాళులు అర్పించిన ప్రముఖులు

1 Sep, 2020 10:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పార్థీవదేహాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వాహనంలో 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఆయన నివాసానికి చేరుకుని ప్రణబ్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, గులాం నబీ ఆజాద్‌, తదితర ప్రముఖులు కూడా ప్రణబ్‌ చిత్రపటానికి అంజలి ఘటించారు.

ప్రణబ్‌ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్రమోదీ ఓదార్చారు. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రణబ్‌ పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ప్రజలకు అవకాశమివ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రణబ్‌ ముఖర్జీ అంతిమయాత్ర  ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రణబ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. కరోనా బారిన పడి నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయం‍త్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

చదవండి: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మరిన్ని వార్తలు