‌నాన్న ఆరోగ్యం మెరుగ‌వుతోంది: ప్ర‌ణ‌బ్ కుమారుడు

16 Aug, 2020 13:40 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్ర‌ప‌తి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ(84) ఆరోగ్య ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేద‌ని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ ఆస్ప‌త్రి ఆదివారం తెలిపింది. నేడు కూడా ఆయ‌న‌కు వెంటిలేట‌ర్‌పైనే చికిత్స అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌రోవైపు ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ మాత్రం ప్ర‌ణ‌బ్ ఆరోగ్యం మెరుగ‌వుతున్న‌ట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్ప‌త్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి ద‌య, మీ ఆశీర్వాదాల వ‌ల్ల ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతోంది. ముందుక‌న్నా ఇప్పుడు పరిస్థితి మెరుగ‌వుతోంది. ఆయ‌న కీల‌క అవ‌య‌వాల‌న్నీ నిల‌క‌డ‌గానే స్పందిస్తున్నాయి. చికిత్స‌కు కూడా స్పందిస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే మ‌న మ‌ధ్య‌కు వ‌స్తార‌ని విశ్వ‌సిస్తున్నా" అని తెలిపారు. (ఇంకా వెంటిలేటర్‌పైనే ప్రణబ్‌)

కాగా మెద‌డులో ఏర్ప‌డ్డ అడ్డంకిని తొల‌గించేందుకు ప్ర‌ణ‌బ్ ఆగ‌స్టు 10న ఆస్ప‌త్రిలో చేర‌గా కోవిడ్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. అదే రోజు ఆయ‌న‌కు మెద‌డు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆరోజు నుంచి ఆయ‌న వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్నారు మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ప్ర‌ణ‌బ్ మ‌ర‌ణించారంటూ వ‌దంతులు వ్యాపించ‌డంతో ఆయ‌న కుమారుడు వాట‌న్నింటినీ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. (కోమాలోనే ప్రణబ్‌ ముఖర్జీ)

మరిన్ని వార్తలు