మగ చైనా.. బరువును మోయడం ఎందుకు?

1 Nov, 2021 18:43 IST|Sakshi
పాల్కీ శర్మ ఉపాధ్యాయ్, ప్రసన్న విశ్వనాథన్

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 


వాళ్లు మాత్రం...

ప్రపంచంలోని ధనికులైన టెక్నోక్రాట్లు ఎందరో తమ ప్రైవేట్‌ జెట్లలో వచ్చి, ఖరీదైన ఫైవ్‌స్టార్‌ విలాస హోటళ్లలో దిగి, చుట్టూ జనం సాగిరాగా భారీ పర్యటనలు జరిపేవాళ్లంతా ఇక ‘కాప్‌ 26’ సమావేశాల్లో రెండు వారాల పాటు మన జీవిత ప్రమాణాలను ఎలా తగ్గించుకోవాలో ఉపన్యాసాలిస్తారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది?
– పాల్‌ జోసెఫ్‌ వాట్సన్, రాజకీయ వ్యాఖ్యాత


మగ చైనా

షీ జిన్‌పింగ్‌ సారథ్యం చైనాలో మొదలయ్యాక– భార్యలుగా, తల్లులుగా మహిళల పాత్ర గురించి ఆయన నొక్కిచెప్పారు. అంతకంటే ముఖ్యం, నిర్దాక్షిణ్యంగా స్త్రీవాద కార్యకలాపాలను అణిచివేశారు. టెలివిజన్లలో సౌకుమార పురుషులు కనబడకుండా నిషేధించారు. ‘మీటూ’కు సంబంధించిన వ్యాఖ్యల్ని తొలగించారు. 
– ప్రసన్న విశ్వనాథన్, సంపాదకుడు


గతపు బరువెందుకు?

ఇండియా ఎందుకు ఈ కామన్‌వెల్త్‌ బరువును మోయడం? స్వతంత్ర దేశాలు ఇంకా ఎందుకు బ్రిటన్‌ రాణిని తమ దేశాధినేతగా ఉంచుకుంటున్నాయి? ఈ దేశాలన్నీ ఇంకా ఎందుకు తమ వలసవాద పాలన తాలూకు సంస్థలతో సహజీవనం చేయాలి?
– పాల్కీ శర్మ ఉపాధ్యాయ్, జర్నలిస్ట్‌


తమదాకా వస్తే...

ఆహార కొరతతో అలమటిస్తున్న అఫ్గానిస్తాన్‌ పట్ల అంతర్జాతీయ సమాజం తన మోయక తప్పని బాధ్యతను వీలైనంత త్వరగా నిర్వర్తించాలి. కానీ మనలో మనమాట... మూడు నెలల క్రితం దాకా కూడా, అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం అందుకుంటున్నందుకు గత ప్రభుత్వాన్ని ఇదే తాలిబన్లు ‘తోలుబొమ్మ ప్రభుత్వం’ అని నిందించేవాళ్లు.
– నతీఖ్‌ మాలిక్‌జాదా, జర్నలిస్ట్‌


మధ్యేమార్గం

తీవ్రమైన అభిప్రాయాలు మనల్ని జీవితంలో ఎటూ తీసుకెళ్లలేవు. మనసు మీద ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉన్న ఒక ఉచితమైన మార్గం, దేనిమీదా తీవ్రమైన అభిప్రాయాలు లేకుండా ఉండటం. 
– వాలా అఫ్షార్, డిజిటల్‌ ఇవాంజెలిస్ట్‌


అక్కర్లేని పరీక్షలొద్దు

ఏ లక్షణాలూ లేనివారికి కూడా సీటీ ఆంజియోను సిఫారసు చేస్తున్న డాక్టర్లందరూ కచ్చితంగా అక్రమ ప్రాక్టీస్‌ నేరస్థులే. కానీ మన ‘ఎయిమ్స్‌’ మాత్రం అలాంటి అంశాల మీద నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించి, డాక్టర్లు అందరూ అనుసరించేలా చేయకుండా పట్టించుకోకుండా ఉంటోంది.     
– డాక్టర్‌ నరైన్‌ రూపానీ, సర్జన్‌


ప్రేమ చాలు...

తీవ్ర జాతీయవాదం దేశభక్తి కాదు. సొంత దేశాన్ని ప్రేమించడానికి ఇంకో దేశాన్ని ద్వేషించాల్సిన పని లేదు. 
– కపిల్‌ దేవ్, పాకిస్తాన్‌ యాక్టివిస్ట్‌

మరిన్ని వార్తలు