ధిక్కారం కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ దోషే

15 Aug, 2020 01:20 IST|Sakshi

దేశ గౌరవాన్నే దెబ్బ తీశారన్న సుప్రీంకోర్టు

20న శిక్ష ఖరారు

న్యూఢిల్లీ: న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థపైనే ప్రశాంత్‌ భూషణ్‌ వదంతులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని అవన్నీ దేశ గౌరవాన్నే దెబ్బ తీసేలా ఉన్నాయని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ కేసు నుంచి ట్విట్టర్‌కి విముక్తి కల్పించింది.  
 ‘నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే న్యాయస్థానాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పెట్టని గోడలు’ అని   ధర్మాసనం అభివర్ణించింది. రాజ్యాంగానికి మూలస్తంభమైన అత్యున్నత న్యాయస్థానంపై ప్రశాంత్‌ భూషణ్‌ దాడికి దిగారని, అది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది.

ప్రశాంత్‌ భూషణ్‌ ఏమని ట్వీట్‌ చేశారంటే ..?
 ప్రశాంత్‌ భూషణ్‌ జూన్‌ 27న చేసిన ట్వీట్‌లో దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులే దీనికి కారణమన్నారు. రెండో ట్వీట్‌లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఎలాంటి మాస్క్, హెల్మెట్‌ ధరించకుండా నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల బైక్‌ని నడుపుతున్నారని, లాక్‌డౌన్‌ అంటూ జనం సమస్యల్ని ప్రత్యక్షంగా విచారించడానికి నిరాకరిస్తూ హెల్మెట్‌ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు