క్షమాపణకు ప్రశాంత్‌ భూషణ్‌ ససేమిరా

25 Aug, 2020 03:42 IST|Sakshi
ప్రశాంత్‌ భూషణ్

ఆత్మసాక్షికి విరుద్ధంగా నడుచుకోలేనని వ్యాఖ్య

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా తాను చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ట్వీట్లలో వ్యక్తపరిచింది తాను విశ్వసించిన నమ్మకాలనేనని, అవి ఇప్పుడూ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిజాయితీ లేకుండా క్షమాపణ చెప్పడం ఆత్మసాక్షిని, ఒక వ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని ఆయన కోర్టు ధిక్కరణ కేసు విషయంలో సోమవారం దాఖలు చేసిన అనుబంధ వాంగ్మూలంలో తెలిపారు.

అనుజ్‌ సక్సేనా అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణను చేపట్టడమే కాకుండా దోషి అని ఆగస్టు 14న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 20వ తేదీన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ ప్రశాంత్‌ భూషణ్‌ కేసుపై విచారణ చేస్తూ.. తన వ్యాఖ్యలపై పునరాలోచన చేసేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. శిక్ష ఖరారు విచారణను వేరే బెంచ్‌కు బదలాయించాలన్న ప్రశాంత్‌ భూషణ్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. శిక్ష ఖరారుపై తుదితీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

న్యాయ వ్యవస్థ నిష్కళంక చరిత్ర పక్కదారి పడుతూంటే ఆ విషయంపై గళమెత్తడం న్యాయవాదిగా తన బాధ్యతని, ఆ కారణంగానే మంచి విశ్వాసంతోనే తన భావాలను వ్యక్తం చేశానని ప్రశాంత్‌ సోమవారం నాటి వాంగ్మూలంలో తెలిపారు. సుప్రీంకోర్టుకు లేదా ఏ ప్రధాన న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించాలన్నది తన ఉద్దేశం  కాదని చెప్పారు. రాజ్యాంగ ధర్మకర్తగా, ప్రజల హక్కులను కాపాడే న్యాయవ్యవస్థ తప్పుదోవ పట్టరాదని సద్విమర్శ మాత్రమే చేశానని వివరించారు.   క్షమాపణ  మాటవరసకు చేసేదిగా కాకుండా నిజాయితీగా ఉండాలని న్యాయస్థానమే చెబుతుందని గుర్తు చేశారు. దేశంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉన్న చిట్టచివరి ఆశ సుప్రీంకోర్టేనని,  ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలకు ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు