2024 Elections: ప్రధాని రేసులో నితీష్‌ కుమార్‌.. ప్రశాంత్‌ కిషోర్‌ హాట్‌ కామెంట్స్‌

10 Aug, 2022 16:22 IST|Sakshi

Prashant Kishor Comments.. బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమార్‌.. కాంగ్రెస్‌, ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం బీహార్‌ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 

కాగా, నితీష్‌ కుమార్‌ వ్యవహారంపై ఎట్టకేలకు జేడీయూ మాజీ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ స్పందించారు. బీహార్‌లో గత 10 పదేళ్లుగా రాజకీయ అస్థిరత యుగం కొనసాగుతోందని, ప్రస్తుత పరిణామాలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు. నితీశ్‌ కుమార్‌ 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన  తర్వాత సంతోషంగా కనిపించలేదని తాజాగా బాంబు పేల్చారు. బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్‌ అయ్యారని చెప్పుకొచ్చారు. ఒకరి రాజకీయ లేదా పరిపాలనా అంచనాలు నెరవేరనప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయాని అన్నారు. 

ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. అయితే, 2015 కూటమి ప్రభుత్వం , ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వం పూర్తిగా వేరని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. కొత్త ప్రభుత్వం బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, బీహార్‌ రాజకీయాల్లో స్థిరత్వం తిరిగి నెలకొంటుందని తాను ఆశిస్తున్నానట్టు స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం యువనేత తేజస్వి యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తారని తాను అనుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో నితీష్‌ కుమార్‌ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేస్తున్నారా అన్న ప్రశ్నకు పీకే బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్‌కు అలాంటి ఆశ లేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. బీహార్‌ రాజకీయాల్లోనే కీలకంగా ఉంటారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారా?

మరిన్ని వార్తలు