‘జన సురాజ్‌’ ప్రకటించిన ప్రశాంత్‌ కిశోర్‌

6 May, 2022 19:23 IST|Sakshi

పట్నా: బిహార్‌లో మా ర్పుతీసుకువచ్చేందుకు ‘జన్‌ సురాజ్‌’ వేదికను ఆరంభిస్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ గురువారం ప్రకటించారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, భవిష్యత్‌లో జన్‌ సురాజ్‌ వేదికే పార్టీగా మారే అవకాశాలుండొచ్చని చెప్పారు. బిహార్‌లో మార్పుకోరుకునే తనలాంటి 18వేల మందితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. వీరందరినీ తాను తలపెట్టిన పాదయాత్రకు ముందే వ్యక్తిగతంగా కలిసేందుకు యత్నిస్తానని చెప్పారు. గాంధీజీ చెప్పిన సరైన చర్యలే మంచి రాజకీయమన్న సూక్తి ఆధారంగా తానీ జన్‌ సురాజ్‌ను ఆరంభించానని తెలిపారు. 

సంవత్సరంలో 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని, రాష్ట్రం నలుమూలలా వీలైనంత మందిని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. లాలూ, నితీశ్‌ సాధ్యమైనంత మేర సాధికారత తెచ్చేందుకు యత్నించారని, కానీ  రాష్ట్రం అభివృద్ధి సూచీల్లో అట్టడుగునే ఉందని తెలిపారు. బిహార్‌కు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు.  అదే సమయంలో బెంగాల్లో మమతతో పనిచేయడంపై జవాబిస్తూ అక్కడ టీఎంసీకి పూర్తి యంత్రాంగం ఉందని, బిహార్‌లో అంతా కొత్తగా ఆరంభించాలని చెప్పారు. బిహార్‌లో ఓబీసీల హవా అధికం, తాను బ్రాహ్మిణ్‌ కావడం వల్లనే భవిష్యత్‌ సీఎంగా ముందుకురాలేకపోయారన్న ప్రశ్నకు బదులిస్తూ బిహార్‌లో ప్రస్తుతం మోదీకి అత్యధిక ఓట్లు రాబట్టే సత్తా ఉందని, కానీ బిహార్‌లో ఆయన కులస్తులెందరున్నారని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: తమిళనాడులో నీట్‌పై రగడ.. ఢిల్లీ తలుపు తట్టిన గవర్నర్‌

మరిన్ని వార్తలు