త్రిపురలో సీఎం రేసులో ప్రతిమా బౌమిక్‌!

6 Mar, 2023 05:21 IST|Sakshi

అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కు దాటి ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీ కూటమిలో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏడాదికాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్‌ సాహాకు పోటీగా కేంద్ర సహాయ మహిళా మంత్రి ప్రతిమా బౌమిక్‌ను సీఎం రేసులో నిలపాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేవ్‌ భావిస్తుండటమే ఇందుకు కారణం. సీఎం అభ్యర్థిగా ఒక్కరినే ఎన్నుకునేలా, ఏకగ్రీవం కోసం ఒప్పించేందుకు ఈశాన్యభారతంలో బీజేపీ సమస్యల పరిష్కర్త, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

బిప్లవ్‌ వర్గాన్ని శాంతింపజేసేందుకు ప్రతిమా బౌమిక్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు శేఖర్‌ దత్తా అభిప్రాయపడ్డారు. 60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 చోట్ల, దాని కూటమి పార్టీ ఐపీఎప్‌టీ ఒక చోట విజయం సాధించిన విషయం తెల్సిందే.  మరోవైపు మార్చి ఎనిమిదో తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.  త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతో అస్సాం సీఎం హిమంత భేటీ అయ్యారు. భేటీలో నాగాలాండ్‌ సీఎంనేపియూ రియో సైతం పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు