వ్యాక్సిన్‌తో పాటు జాగ్రత్తలూ అవసరమే

30 Apr, 2021 20:41 IST|Sakshi

మే 1 నుంచీ 18ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఇప్పటికే దాదాపుగా 2 కోట్ల మంది వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకున్నారు. ఈ నమోదు చేసుకుంటున్న వేగం చూస్తుంటే సగటున రోజుకి కోటికిపైగానే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. దీంతో మరికొన్ని నెలల పాటు దేశం మొత్తం నలువైపులా వ్యాక్సినేషన్‌  ముమ్మరం కానుంది. మరోవైపు వ్యాక్సిన్‌ పనిచేసే తీరు తెన్నులపైనా ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు, అపోహలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌లో గత కొంత కాలంగా కోవిడ్‌ బాధితులతో పనిచేస్తున్న డా.గుట్టా లోకేష్‌ ఆ సందేహాలకు ఇసక్తున్న సమాధానాలివి...

మార్పు చేర్పులు ఉండవు...
18 ఏళ్లు పైబడిన వారందరికీ వేయనున్నారు కాబట్టి... వీరికి సంబంధించి ఏమైనా మార్పు చేర్పులుంటాయా అని కొందరు సందేహిస్తున్నారు. అయితే అలాంటివేం ఉండవు. గతంలో 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేసినట్టే వీరికి కూడా వేయడం జరుగుతుంది. వయసును బట్టి వ్యాక్సిన్‌ పరిమాణంలోగానీ, మరే విషయంలో గానీ తేడా ఉండదు. 

వ్యాక్సిన్‌తో అంతా అయిపోదు..
చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకుంటే చాలు ఇక కోవిడ్‌ సంబంధించి ఏ సమస్య ఉండదు అనుకుంటున్నారు. అయితే అది సరైంది కాదు. వ్యాక్సిన్‌ ద్వారా మనకి 100శాతం సురక్షితమైన పరిస్థితి రాదు. వ్యాక్సిన్‌  తయారీ దారులు కూడా 60 నుంచి 70శాతం మాత్రమే అది మనకు రక్షణ ఇస్తుందని చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకున్నాంలే అనే అతి థీమా పనికిరాదు.

ఇమ్మీడియట్‌ ఇమ్యూనిటీ రాదు..
వ్యాక్సిన్‌ వేయించుకున్న వెంటనే మనకు వ్యాధి నిరోధక శక్తి వచ్చేసినట్టు అనుకోవద్దు. దీనికి కొంత సమయం పడుతుంది.  సెకండ్‌ డోస్‌ వేయించుకున్న 2 వారాలకు గాని వ్యక్తిలో  ఇమ్యూనిటీ  స్టార్ట్‌ అవదు.. అంటే ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో సంతరించుకోవాలంటే తొలి డోస్‌ నుంచి కనీసం 45 రోజులు పడుతుంది. శరీరంలో యాంటీ బాడీస్‌ చెక్‌ చేయించుకోవాలి అనుకుంటే అప్పటిదాకా ఆగాల్సిందే.  తొలి డోస్‌ వేయించుకోవడం వెంటనే ఏమీ  కాదులే అనుకుని తిరగొద్దు. చాలా మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయి 45 రోజుల తర్వాత యాంటీ బాడీస్‌ వచ్చిన వారిలో కూడా కొంత మందికి పాజిటివ్‌ వచ్చిన దాఖలాలున్నాయి అయితే మిగతా  వారితో పోలిస్తే చాలా స్పీడ్‌ రికవరీ ఉంది.  

డోస్‌కీ డోస్‌కీ మధ్య వ్యవధి...
ఇక తొలిడోస్‌కి రెండో డోస్‌కి మధ్య వ్యవధి విషయంలో చాలా రకాల సందేహాలు గమనించాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ రెండింటికీ వ్యవధి ఒకటే. రెండింటికీ.. తొలి డోస్‌ నుంచి రెండో డోస్‌కి మధ్య తొలుత 28 రోజుల వ్యవధి చాలని చెప్పారు ఆ తర్వాత మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని దాన్ని 6 నుంచి 8వారాల వరకూ పెంచారు. 

ఆలస్యమైతే...ఎలా?
గత 2, 3 వారాల నుంచీ డిమాండ్‌ బాగా పెరగడం వల్ల తగినంత పరిమాణంలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడం కొంత మందికి సెకండ్‌ డోస్‌ ఆలస్యం అవుతోంది. ఏదేమైనా కోవిషీల్డ్‌  లేదా కోవ్యాగ్జిన్‌ గానీ రెండోడోస్‌ తీసుకోవడానికి అత్యధికంగా 8 వారాలు  లేదా 2 నెలల వరకూ వ్యవధి ఉండవచ్చు. ఈ లోగానే వేయించుకోవడం బెటర్‌.

థర్డ్‌ వేవ్‌ టైమ్‌కి ఇది పనికి వస్తుందా?
అనూహ్యంగా వచ్చిపడిన సెకండ్‌ వేవ్‌ చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మనం దాన్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాం కానీ,  దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ థర్డ్‌వేవ్‌ లాంటిది ఈ సారి వస్తే... మనం దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతామని చెప్పవచ్చు. 

-డాక్టర్‌ గుట్టా లోకేష్, కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, మణిపాల్‌ హాస్పిటల్స్, విజయవాడ

మరిన్ని వార్తలు