గర్భవతి.. అందునా ఉపవాస దీక్షలో ఉంటూ కోవిడ్‌ సేవలు

24 Apr, 2021 19:46 IST|Sakshi

వృత్తే ముఖ్యం అంటున్న గుజరాత్‌ నర్స్‌

అహ్మాదాబాద్‌: కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఎవరికైనా కోవిడ్‌ అని తెలిస్తే చాలు.. సమాజం వారిని వెలి వేస్తుంది. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా వారి దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు. ఇలాంటి వేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు వారి ప్రాణాలను సైత పణంగా పెట్టి సేవలు చేస్తున్నారు. వీరిలో కొందరు మహిళలు గర్భవతులుగా ఉండి కూడా కోవిడ్‌ రోగులకు వైద్యం అందిస్తున్నారు. 

ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి గుజరాత్‌లో వెలుగు చూసింది. గర్భవతి అయి ఉండి కూడా ఓ నర్స్‌ కోవిడ్‌కు ఏమాత్రం భయపడకుండా జనాలకు సేవ చేస్తుంది. ప్రస్తుతం రంజాన్‌ మాసం కావడంతో ఉపవాస దీక్ష కూడా పాటిస్తుంది. ఆమె సేవా స్ఫూర్తికి జనాలు ఫిదా అయ్యారు. నిన్ను, నీ కడుపులోని బిడ్డను దేవుడు చల్లగా కాపాడతాడు అంటూ ఆశీర్వదిస్తున్నారు.

ఆ వివరాలు.. నాన్సీ అయేజా మిస్త్రీ అనే మహిళ సురత్‌లో నర్స్‌గా విధులు నిర్వహిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె సురత్‌లోని అల్థాన్‌ కమ్యూనిటీ హాల్‌లో కోవిడ్‌ రోగులకు సేవలు అందిస్తుంది. ప్రస్తుతం ఆమె నాలుగు గర్భవతి. అయినప్పటికి ఏమాత్రం భయపడకుండా కోవిడ్‌ రోగులకు సేవ చేస్తుంది. మరో విషయం ఏంటంటే రంజాన్‌ సందర్భంగా ఆమె రోజా (ఉపవాస దీక్ష) పాటిస్తుంది. ఏ మాత్రం అలసట చెందకుండా.. విసుక్కోకుండా.. ప్రతి రోజు 8-10 గంటలకు రోగులకు వైద్యం చేస్తుంది. 

‘‘ఇంత రిస్క్‌ తీసుకొని.. అది కూడా కడుపులో బిడ్డను మోస్తూ... ఇలా విధులు నిర్వహించడం అవసరమా’’ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆమె నవ్వుతూ ఇలా అంటుంది.. ‘‘నా కడుపులో బిడ్డ పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ విధినిర్వహణ నాకు అంతకన్నా ముఖ్యం. దేవుడి దయ వల్ల రంజాన్‌ లాంటి పవిత్ర మాసంలో నాకు రోగులకు సేవ చేసే అవకాశం లభించింది. వారి ఆశీర్వదాలతో నేను, నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాం’’ అంటున్నది నాన్సీ.

మరిన్ని వార్తలు