ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వాళ్లకు ‘నడక’యాతన తప్పట్లేదు

16 Jul, 2021 15:40 IST|Sakshi

రాయగడ( భువనేశ్వర్‌): ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రాయగడ జిల్లాకు ఒరిగిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలే కాకుండా జిల్లా కేంద్రానికి సమీప గ్రామాలు కూడా కనీసం రహదారి సదుపాయానికి నోచుకోలేదని వాపోతున్నారు. జిల్లాను ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల నుంచి  గర్భిణులను మంచాలపై మోసుకుంటూ అంబులెన్స్‌ వరకు తీసుకువస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి.

నిండు గర్భిణినైనా రెండు కిలోమీటర్ల నడవాల్సిందే
ఈ క్రమంలో నిండు గర్భిణిని రెండు కిలోమీటర్ల దూరం నడిపించుకుంటూ తీసుకువెళ్లిన సంఘటన గురువారం జరిగింది. అయితే అదేదో మారుమూల కుగ్రామం అనుకుంటే పొరబడినట్లే. జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ సంఘటన సంభవించడంతో అధికారులు సైతం ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సమీప తడమ పంచాయతీ పరిధి హులుకి గ్రామానికి చెందిన కైలాస కడ్రక భార్య సంజిత కడ్రక పురిటినొప్పులతో బాధపడుతుండడంతో సమాచారం మేరకు అంబులెన్స్‌ వచ్చి సరైన రహదారి లేక హులుకి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని జరఫా గ్రామంలో ఉండిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న కైలాస కడ్రక, వదిన మోతికడ్రక, మరో యువతి సహాయంతో కలిసి గర్భిణి సంజిత కడ్రకను ముళ్ల పొదల మీదనుంచి అతి కష్టం మీద నడిపించుకుంటూ అంబులెన్స్‌ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అంబులెన్స్‌ వరకు డోలీలో తీసుకువెళ్లేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో నడిపించుకుని తీసుకువెళ్లాల్సి వచ్చిందని భర్త కైలాస కడ్రక తెలియజేశాడు.

మరిన్ని వార్తలు