వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి.. సంతోషం ఆవిరి!

13 Sep, 2022 08:22 IST|Sakshi

మాలూరు: ఎన్నో ఆశలతో ఆస్పత్రికి వెళ్లినవారికి విషాదమే మిగిలింది. ప్రసూతి కోసం వచ్చిన మహిళకు సాధారణ ప్రసవం చేస్తామని చెప్పి, చివరకు మా చేత కాదని జిల్లాస్పత్రికి పంపించగా అక్కడ తల్లీ శిశువు కన్నుమూశారు. ఈ విషాద సంఘటన కర్నాటకలోని కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని దొడ్డశివార గ్రామంలో జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.  

సహజ ప్రసవం చేస్తామని జాప్యం  
వివరాలు... దొడ్డశివార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవం కోసం గర్భిణి సుధ (34) శుక్రవారం చేరింది. నొప్పులు ప్రారంభం కాగా వైద్యులు సాధారణ ప్రసవం చేయిస్తామని చెప్పి వేచి చూశారు. సాయంత్రం చివరికి ఫిట్స్‌ వచ్చాయని చెప్పారు. కాన్పు చేయకపోగా పరిస్థితి బాగాలేదని జిల్లాస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా ఆడశిశువుకు జన్మనిచ్చి సుధ ప్రాణాలు వదిలింది. కొంతసేపటికి బిడ్డ కూడా చనిపోయింది. సుధకు భర్త రవి, ఆరేళ్ల పాప ఉన్నారు. 

సోమవారం కుటుంబీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన చేయడంతో విషయం వెలుగుచూసింది. సరైన వైద్యం చేయని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తాలూకా వైద్యాధికారి డాక్టర్‌ ప్రసన్న, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌లు చేరుకుని విచారణ చేశారు. తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు.
 

మరిన్ని వార్తలు