ప్రసవ వేదన.. జోలెకట్టి 8 కిలోమీటర్ల దూరం వరకు..

25 Jul, 2021 07:53 IST|Sakshi

గర్భిణీని 8 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్తులు

మధ్యప్రదేశ్‌లో ఘటన

బర్వానీ: అటవీ ప్రాంతం..కనీసం రహదారి సౌకర్యం కూడా లేని గ్రామం..గర్భిణీని అత్యవసరంగా తరలించాల్సిన పరిస్థితి.. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి వెదురు కర్రకు జోలెను కట్టి, తాత్కాలిక స్ట్రెచర్‌గా మార్చారు. అందులో గర్భవతిని పడుకోబెట్టి 8 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ బురదమయమైన మార్గంలో రాణికాజల్‌ అనే చోటుకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్సులో 20 కిలోమీటర్ల దూరంలోని పన్సేమల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా ఖామ్‌ఫట్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రావనికి చెందిన సునీత నిండు గర్భిణీ. గురువారం ప్రసవ వేదన పడుతుండటంతో వెదురు కర్రకు దుప్పటిని కట్టి తయారు చేసిన తాత్కాలిక స్ట్రెచర్‌లో వెసుకెళ్తున్న ఈ వీడియోపై అధికారులు స్పందించారు. ఆ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గర్భిణీని మోసుకురావాల్సి వచ్చిందని పన్సేమల్‌ బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి(బీడీవో) అర్వింద్‌ కిరాడే తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఆమె ప్రసవింంది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. జిల్లా పంచాయతీ సీఈవో రితురాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ..ఖామ్‌ఫట్‌ గ్రావనికి రహదారి నిర్మాణం విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధిత శాఖల నుంచి అవసరమైన ‘నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ పొందడం కష్టంగా మారిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు