తోపుడు బండిపై ఆసుపత్రికి గర్భిణి.. తీరా వెళ్లాక వైద్యులు లేకపోవటంతో..!

31 Aug, 2022 20:43 IST|Sakshi

భోపాల్‌: తన గర్భిణీ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఓ వ్యక్తి. అంబులెన్స్‌ రాకపోవటంతో తోపుడు బండిపై స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లేరు. కనీసం నర్సులు సైతం లేకపోవటంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో వెలుగు చూసింది.

జిల్లాలోని రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాస్ అహిర్వార్‌ అనే వ్యక్తి​ భార్య కాజల్ నిండు గర్భిణీ. ఆమెకు మంగళవారం పురిటి నొప్పులు రావడం వల్ల కైలాస్.. అంబులెన్స్‌కు కాల్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అంబులెన్స్​రాలేదు. దీంతో చేసేదేం లేక తోపుడు బండిపై ఆమెను పడుకోబెట్టి కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆస్పత్రిలో వైద్యుడు, నర్స్​ అందుబాటులో లేరు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. అక్కడే ఉన్న కొందరు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ రాగా హాటా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. చివరకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మెడికల్​ఆఫీసర్​ఆర్​పీ కోరి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండి: ఇదెక్కడి న్యాయం.. ఆ వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ యాక్ట్‌ కింద కేసులా?

మరిన్ని వార్తలు