న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతను కాపాడుకోవాలి

15 Nov, 2021 04:06 IST|Sakshi

కింది కోర్టులు సులభమైన భాషలో తీర్పులివ్వాలి 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ  

న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను అన్ని స్థాయిల్లోనూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతల పరిరక్షణ, ప్రచారం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ట్రయల్‌ కోర్టు, జిల్లా కోర్టుల పని తీరుపైనే భారత న్యాయ వ్యవస్థ ఔన్నత్యం ఆధారపడి ఉందని, ఆ కోర్టులు ఇచ్చే తీర్పుల ద్వారా లక్షలాది మందికి ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు.

ఆదివారం ఢిల్లీలో నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన, ప్రచార కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రసంగించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన కోర్టులు ఇచ్చే తీర్పులు సమాజంపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయని, సంక్షేమ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఎంతో కీలకమైనదని ఉద్ఘాటించారు. ‘‘ట్రయల్‌ కోర్టు, జిల్లా కోర్టుల పనితీరును ఆధారంగా చేసుకొని భారత న్యాయవ్యవస్థపై లక్షలాది మంది అంచనాలు ఏర్పాటు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో కోర్టులు బలోపేతమైతేనే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటవుతుంది.

అందుకే న్యాయ వ్యవస్థ స్వతంత్రం, సమగ్రతలను కాపాడుకోవడానికి మించి దేనికి ప్రాధాన్యం లేదు’’ అని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను ఉద్దేశించి తొలిసారిగా ముఖాముఖి మాట్లాడిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ ‘‘రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతల్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించాలి. అప్పుడే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. కింద కోర్టులు ఇచ్చిన తీర్పులు సామాజికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆ తీర్పులు అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషలో స్పష్టంగా ఉండాలి’’ అని ఉద్బోధించారు.  

మరిన్ని వార్తలు