Parliament Budget Session: కేంద్రం భేష్‌.. రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్రంపై ప్రశంసల జల్లు

31 Jan, 2023 12:06 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగాన్ని ద్రౌపది ముర్ము.. పార్లమెంట్‌ సభ్యుల సాక్షిగా దేశానికి వినిపించారు. ఈ క్రమంలో దేశం అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్న ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. 

మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్నది ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే  తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ మంచి కార్యక్రమం. భారత్‌ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలి.  పేద, మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ పెద్ద భరోసా. పేదల ఉపాధి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. మూడు కోట్ల మంది పేదలకు కేంద్రం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మూడేళ్లలో 11 కోట్ల మందికి ఇంటింటికీ మంచినీరు అందించింది. దేశ ప్రజలకు కోవిడ్‌ నుంచి విముక్తి కల్పించింది ప్రభుత్వం. నిరుపేద కోవిడ్‌ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది.

అన్ని విధాలుగా కోవిడ్‌ కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేసింది. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాళ్ల అభివృద్ధికి పాటుపడుతోంది. ఓబీసీల సంక్షేమం కోసం కీలక ముందడుగు వేసింది. గిరిజన నేతలకు మంచి గుర్తింపు లభిస్తోంది. బాగా వెనుకబడిన గ్రామాలను కేంద్రం అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. భేటీ బచావ్‌-భేటీ పడావ్‌ నినాదం ఫలితాన్నిచ్చింది. దేశంలో తొలిసారిగా మహిళల సంఖ్య పెరిగింది. పీఎం ఆవాస్‌ యోజన పథకం సత్ఫలితాలు ఇచ్చింది. బాలికల డ్రాప్‌ అవుట్స్‌ తగ్గాయి. అంతరిక్ష ప్రయోగాలతో భారత్‌ అత్యద్భుత ప్రగతి సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ అతిపెద్ద శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ ఫార్మా హబ్‌గా భారత్‌ ఎదుగుతోందని కొనియాడారామె.

ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పొరుగు దేశాల సరిహద్దుల్లోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. దేశంలో అవినీతిపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తన ప్రసంగంలో కేంద్రంపై ప్రశంసలు గుప్పించారామె.

మరిన్ని వార్తలు