ఇద్దరు చిన్నారులకు బాలశక్తి పురస్కారాలు

24 Jan, 2023 01:04 IST|Sakshi
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటున్న గౌరవి రెడ్డి, అలాన మీనాక్షి 

పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు అందించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 

కళ – సంస్కృతి విభాగంలో తెలంగాణకు చెందిన నాట్యకళాకారిణి ఎం.గౌరవి రెడ్డి

క్రీడల విభాగంలో ఏపీకి చెందిన చెస్‌ క్రీడాకారిణి కోలగట్ల అలాన మీనాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చిన్నారులు 2023 సంవత్సరానికిగానూ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆరు విభాగాల్లో 11 మంది చిన్నారులకు బాలశక్తి పురస్కారాలు అందజేశారు.

కళ, సంస్కృతి విభాగంలో నలుగురు,  శౌర్యం విభాగంలో ఒకరు, నూతన ఆవిష్కరణలలో ఇద్దరు, సామాజికసేవలో ఒకరు, క్రీడా విభాగంలో ముగ్గురు మొత్తంగా 11 మంది చిన్నారులకు పురస్కారాలను అందించారు. కళ సంస్కృతి విభాగంలో అతి పిన్న వయస్కురాలిగా యునెస్కోలోని ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ కౌన్సిల్‌లో నామినేట్‌ అయిన తెలంగాణకు చెందిన నాట్యకళాకారిణి ఎం.గౌరవి రెడ్డి,  క్రీడా విభాగంలో విశాఖపట్నానికి చెందిన 11 ఏళ్ల అంతర్జాతీయ చెస్‌ క్రీడాకారిణి, గతేడాది మే–అక్టోబర్‌ మధ్య అండర్‌–11 బాలికల కేటగిరీలో ప్రపంచ నెంబర్‌–1 గా నిలిచిన కోలగట్ల అలాన మీనాక్షి ఈ బాలశక్తి పురస్కారాలు స్వీకరించారు. అవార్డు గ్రహీతలకు పతకం, రూ.లక్ష నగదు బహుమతి, ధ్రువపత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. కాగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు  పురస్కారాల గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించనున్నారు. 

మరిన్ని వార్తలు