‘పద్మ’ అవార్డుల ప్రదానం

22 Mar, 2022 05:10 IST|Sakshi
అవార్డులు స్వీకరిస్తున్న స్వామి శివానంద, దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కూతుళ్లు

జనరల్‌ రావత్, ఖేమ్కాలకు మరణానంతరం పద్మవిభూషణ్‌ 

పద్మభూషణ్‌ స్వీకరించిన గులాం నబీ ఆజాద్, సైరస్‌ పూనావాలా

గరికపాటి సహా నలుగురు తెలుగు వారికి పద్మశ్రీలు

సాక్షి, న్యూఢిల్లీ: 2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ సోమవారం పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్‌ అధినేత దివంగత రాధేశ్యామ్‌ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్‌ ఖేమ్కాలు పద్మ విభూషణ్‌ పురస్కారాలను స్వీకరించారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఎండీ సైరస్‌ పూనావాలా, పంజాబీ జానపద గాయకుడు గుర్మీత్‌ బావా (మరణానంతరం), టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్, మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహర్షి, దేవేంద్ర ఝఝరియా, రషీద్‌ ఖాన్, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్‌ పురస్కారాలను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్‌ గరికపాటి నరసింహారావు, డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్‌ హసన్‌ సాహెబ్‌ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం ఈ నెల 28న జరుగనుంది. ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు