ప్రజలందరికీ రక్షకులు నర్సులు 

4 Aug, 2020 04:45 IST|Sakshi

రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంస

న్యూఢిల్లీ: ఎదుటివారని రక్షించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతోన్న రక్షకులు అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నర్సులను అభివర్ణించారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో నర్సింగ్‌ కమ్యూనిటీ సభ్యులతో కలిసి కోవింద్‌ రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి నర్సులు రాఖీలు కట్టి, కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ అనుభవాలను రాష్ట్రపతితో పంచుకున్నారని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో నిలిచి పోరాడుతోన్న నర్సుల సేవలను, వారి నిబద్ధతను, కొనియాడిన రామ్‌నాథ్‌ కోవింద్‌ వారిని సత్కరించారు. సహజంగా రక్షాబంధన్‌ రోజు, తమ సోదరుల నుంచి అక్కాచెల్లెళ్ళు రక్షణను కోరకుంటారు. అయితే నర్సులు మాత్రం ఎంతో నిబద్ధతతో, అంకిత భావంతో సోదరులకు, ప్రజలందరికీ రక్షణగా నిలుస్తారు అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నర్సులపై ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్‌ మహమ్మారితో పోరాడుతోన్న వారికి సేవలందిస్తూ కరోనా బారిన పడినప్పటికీ తిరిగి కోలుకుని, నూతన శక్తితో విధులను నిర్వర్తించిన సైనిక విభాగంలోని నర్సులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. నర్సులందరికీ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు